Advertisement

Advertisement


Home > Politics - Analysis

రాజకీయ ప్రత్యర్థి, విపక్ష నేత అయినా ప్రాధాన్యమిచ్చిన కేంద్రం

రాజకీయ ప్రత్యర్థి, విపక్ష నేత అయినా ప్రాధాన్యమిచ్చిన కేంద్రం

దేశమంతా రాజకీయ కక్షలు రాజ్యమేలుతున్న కాలం ఇది. విపక్ష పార్టీల ప్రభుత్వాలు కేంద్రంపై కారాలు మిరియాలు నూరుతున్నాయి. విపక్ష ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందుల పాలు చేస్తోంది. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఆ ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (అంటే అధికారంలో ఉన్న బీజేపీ) తాము అస్సలు ఇష్టపడని రాజకీయ ప్రత్యర్థిని, అదికూడా అధికారం లేని ప్రతిపక్ష నాయకుడిని జాతీయ స్థాయిలో జరిగే కీలక సమావేశానికి ఆహ్వానించడం చెప్పుకోదగ్గ విషయమే. ఆ ప్రతిపక్ష నాయకుడు ఎవరో కాదు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఒకప్పుడు బాబు మిత్రుడు. ఏపీలో టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంటే, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. 2019 ఎన్నికలకు ఏడాది ముందువరకు రెండు పార్టీలు దోస్తులే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని బీజేపీ చెప్పినా బాబు సర్దుకుపోయారు. కానీ తనకు అధికారం ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సాధిస్తానని జగన్ హామీ ఇవ్వడంతో కంగు తిన్న బాబు వైసీపీ ట్రాప్ లో పడిపోయి భయపడిపోయారు. కేంద్రంతో భీకరంగా తగాదా పెట్టుకున్నారు. దీంతో బద్ధ శత్రువుగా మారిపోయారు. 

గత ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. దీంతో ఢిల్లీ పెద్దలెవరూ బాబు మొహం చూడటానికి ఇష్టపడలేదు. బాబే మళ్ళీ బీజేపీతో దోస్తీ కోసం పాకులాడుతున్నారు. జనసేనతో పాటు బీజేపీని కూడా కలుపుకొని జగన్ ను అధికారంలోకి రానివ్వకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా బీజీపీ కేంద్ర పెద్దలు సుముఖంగా లేరు. టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ ను కూడా నిలువరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ అంశం ప్రాతిపదికగా జరిగే కీలక సమావేశానికి కేంద్రం చంద్రబాబును ఆహ్వానించింది. అంటే ఇందుకు బీజీపీ పెద్దలు కూడా సుముఖత వ్యక్తం చేశారనుకోవాలి. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో పాల్గొనాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. 

భారత్‌లో నిర్వహించే జీ-20 భాగస్వామ్య దేశాల సమావేశాలను ఎలా నిర్వహిస్తే బాగుంటుందనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. సమావేశానికి హాజరు కావాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి చంద్రబాబుకు ఫోన్‌ చేసి ఆహ్వానించారు. సమావేశానికి ఉన్న ప్రాధాన్యతను బాబుకు వివరించారు. డిసెంబర్‌ 5న సాయంత్రం 5.00 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో సదస్సు జరగనుంది.

జీ-20 దేశాల కూటమికి భారత్‌ అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే. 2023లో భారతదేశం జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సును నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు దేశంలోని ప్రముఖ రాజకీయవేత్తలను కేంద్రం ఆహ్వానిస్తోంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వారిదగ్గర నుంచి అవసరమైన సలహాలు, సూచనలు తీసుకొని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయబోతోంది. దీనిలో భాగంగానే చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆహ్వానం పంపించారు. 

ఈ ఆహ్వానం కేవలం ఈ సమావేశానికి పరిమితమవుతుందా? రాబోయే రోజుల్లో ఏపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏమైనా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయా? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?