Advertisement

Advertisement


Home > Politics - Analysis

పవన్ మదిలో ఏముంది?

పవన్ మదిలో ఏముంది?

భాజపా తనతోనే వుండమంటుందా? తేదేపా తనతో కలిసి రమ్మంటుందా? ఇవన్నీ పక్కన పెడితే అసలు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ మనసులో ఏముంది? 2024 ఎన్నికలకు ఏ విధంగా జనాల ముందుకు వెళ్లాలనుకుంటున్నారు? ఇది అంత సులువుగా సమాధానం అందని మిలియన్ డాలర్ క్వశ్చన్. 2014 ఎన్నికల ముందు మోడీతో పాటు డయాస్ మీద ప్రత్యక్షమైనా, ఆ తరవాత హడావుడి అంతా తెలుగుదేశంతో కలిసే చేసారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే చేసారు.

2019 ఎన్నికలకు కాస్త ముందు భాజపాతో తెగతెంపులు చేసుకోవడం వెనుక కూడా తెలుగుదేశం అడుగుజాడే వుంది. అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీ కి మోడీ-అమిత్ షా ద్వయం కొరకరాని కొయ్యగా తయారైతే ఇక లాభం లేదు అని చంద్రబాబు తిరుగుబాటు జెండా ఎగరేసారు. దాదాపు అదే విధంగా పవన్ కూడా ‘పాచిపోయిన లడ్లు’ అనే రాగం అందుకున్నారు.

2019లో జనసేన విడిగా పోటీ చేసినట్లు కనిపించినా, దాని వెనుక ఓ అండర్ స్టాండింగ్ వుందని క్లియర్ గా అర్థమైపోయింది అప్పట్లోనే. గాజువాకలో పవన్ విజయానికి ఎదురీదుతున్న వేళ అక్కడ సరైన స్ట్రాంగ్ అభ్యర్థిని పెట్టకుండా, ప్రచారానికి వెళ్లకుండా చంద్రబాబు సహకరించారని వార్తలు వినవచ్చాయి.

వైకాపా అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే పవన్ వెళ్లి భాజపా పంచన చేరారు. అప్పటి నుంచి తెలుగుదేశం-భాజపాల మైత్రీకి పవన్ కృషి చేస్తున్నారనే వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. పంచాయతీ, మండల ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన లోపాయకారీ పొత్తు పెట్టుకునే పని చేసాయన్నది అందరికీ తెలిసిందే.

ఇప్పుడు మరి మోడీ అడ్డం పడితే పవన్ ఆగుతారా? లేక తేదేపాతో కలిసే వెళ్తారా?  ఈసారి తేదేపాతో కలిసి వెళ్లకపోతే అటు ఆ పార్టీ, ఇటు జనసేన రెండూ చెడిపోతాయని తెలుగునాట సామాజిక మీడియా తెగ బెదిరిస్తోంది. పవన్ ను భయపెడుతోంది. మరోసారి జగన్ వస్తే ఇక జనసేన పని గల్లంతే అన్నట్లు వార్తలు వండి వారుస్తోంది. తెలుగుదేశంతో కలిసి వెళ్తేనే అయిదు పది సీట్లు అయినా గెలుచుకోవచ్చని ఆశ పెడుతోంది. అంతే తప్ప జనసేన లేకపోతే తెలుగుదేశం పల్లకి ని మోసేవారు లేరని క్లారిటీ ఇవ్వడం లేదు.

ఇలాంటి నేపథ్యంలో జనసేన ఆలోచన ఏమిటి? తెగించి భాజపాను వదిలి తేదేపాతో వెళ్తుందా? లేదా భాజపాను ఒప్పించి తేదేపా చెంతకు తీసుకెళ్లగలుగుతుందా? భాజపా మనసు మార్చడానికి సామాజిక మీడియా పెద్దలు వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అవి అనుకూలిస్తే పవన్ పని చాలా అంటే చాలా సులువు అవుతుంది. కానీ అలా జరగకపోతే పరిస్థితి ఏమిటి?

పవన్ మాటలు ఓపెన్ గానే వున్నాయి. అందరినీ కలుపుకుని వైకాపాను అధికారం నుంచి లాగేయాలన్నది తన ఆశయం అని ఆయన క్లారిటీగా చెబుతూ వస్తున్నారు. జనసేన లెఫ్ట్ నెంట్ మనోహర్ వైఖరి కూడా ఇలాగే వుంది. తెలుగుదేశంతో జనసేనను కలవనివ్వం అని భాజపా నేతలు అంటూ వుంటే వెంటనే ఖండించే పనిని మనోహర్ నే తలకెత్తుకున్నారు.

ఇవన్నీ చూస్తుంటే పవన్ ..తేదేపా..దాని అనుకూల సామాజిక మీడియా ఎజెండా ఒకే విధంగా కనిపిస్తోంది. రాబోయే ఏడాదిన్నరలో జగన్ మీద వీలయినంత బురద జల్లి, జగన్ గురించి నెగిటివిటీని భాజపా అధిష్టానం దగ్గర వీలయినంత పెంచి, మళ్లీ 2014లో మాదిరిగా తెలుగుదేశానికి దగ్గర చేయడమే లక్ష్యంగా క్లారిటీ వస్తోంది.

అందుకే పొత్తుల గురించి ఇప్పుడు కాదు..ఎన్నికల టైమ్ లో అంటున్నారు జనసేన నాయకులు. నిజానికి తేదేపా వైపు మనసు లాగకుండా వుండి వుంటే అనే మాటలు వేరుగా వుంటాయి. తమకు ఆల్రెడీ భాజపాతో పొత్తు వుందని, కొత్త పొత్తులు అవసరం లేదని అనే వారు. అలా అనకుండా ‘ద్వారము తెరిచియే వున్నది’ టైపు కబుర్లు చెబుతున్నారు అంటేనే అర్థం అయిపోతోంది. మరో ఏడాదిన్న కాలం అంతా భాజపా-తేదేపా-జనసేన బంధం కోసం తెర వెనుక ప్రయత్నాలు జరుగుతూనే వుంటాయి అని. అదే పవన్ మనసులో వున్న ఆలోచన..అంతకన్నా మరేం కాదు.  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?