Advertisement

Advertisement


Home > Politics - Analysis

ప్రాంతీయ పార్టీల్లో అధ్యక్ష ఎన్నిక పేరుకు మాత్రమే

ప్రాంతీయ పార్టీల్లో అధ్యక్ష ఎన్నిక పేరుకు మాత్రమే

మనదేశంలో జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలే అధికం. ప్రస్తుతం చెప్పుకోదగ్గ జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్. ఇక కమ్యూనిస్టు పార్టీలైన సీపీఎం, సీపీఐ జాతీయ పార్టీలైనప్పటికీ జనానికి ఆ సంగతి మైండ్ లో లేదు. వామపక్ష పార్టీల్లో సీపీఎం కాస్త బెటర్. సీపీఐ జాతీయ పార్టీ గుర్తింపు రద్దు చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం అనేకసార్లు చెప్పింది. ఎందుకంటే ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం అది సీట్లు, ఓట్లు తెచ్చుకోవడంలేదు. ప్రాంతీయ పార్టీల్లో కొన్ని జాతీయ స్థాయిలో విస్తరించనప్పటికీ జాతీయ పార్టీలుగా ప్రచారం చేసుకుంటున్నాయి.

ఉదాహరణకు ...టీడీపీ వాళ్ళు చంద్రబాబును పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, లోకేష్ ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా చెబుతుంటారు. వైసీపీది కూడా ఇదే ధోరణి. ఇలా జాతీయ పార్టీలుగా చెప్పుకునే ప్రాంతీయ పార్టీలు ఇంకా ఉండొచ్చు. ఇక ప్రధానంగా ప్రాంతీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం, సంస్థాగత ఎన్నికలు అనేవి శూన్యం. ఒకవేళ ఉన్నా నామమాత్రమే. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లోనూ ఇదే పరిస్థితి. కాకపొతే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నిర్దిష్ట కాలంలో ఎన్నికల తతంగం జరిపిస్తారు.

లేకపోతే ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తుంది కాబట్టి. కానీ వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా విషయాల్లో ఓవరాక్షన్ చేస్తాడు కదా. పార్టీ అధ్యక్ష ఎన్నికల విషయంలోనూ ఓవరాక్షన్ చేసి తలనొప్పి తెచ్చుకున్నాడు. చివరకు కిందా మీదా పడి సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో కవర్ చేసుకుంటున్నాడు. తప్పదు కదా. పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదంటూ కేంద్ర ఎన్నికల కమిషన్  తేల్చిచెప్పింది.

కొన్ని నెలల కిందట జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో జగన్ను శాశ్వత అధ్యక్షుడిగా నేతలు తీర్మానం చేశారు. అయితే ఆ తీర్మానం చెల్లదని అప్పట్లోనే అందరికీ తెలుసు. ఎందుకంటే పార్టీల్లో అధ్యక్ష పదవిని ఎన్నిక ద్వారా మాత్రమే భర్తీ చేయాలి కానీ తీర్మానం ద్వారా కాదు. తన శాశ్వత అధ్యక్ష పదవి కమిషన్ నిబంధనల ప్రకారం చెల్లదని తెలిసినా అదే తీర్మానాన్ని చేయించుకున్నారు. దాంతో మీడియాలో వచ్చిన వార్తలు, కథనాల ఆధారంగా వైసీపీకి కమిషన్ నోటీసులిచ్చింది. అయితే ఆ నోటీసులకు సమాధానం ఇవ్వలేదు. 

దాంతో వేరే దారిలేక జగన్ శాశ్వత అధ్యక్ష పదవి తీర్మానాన్ని రద్దు చేస్తున్నట్లు ఫైనల్ ఉత్తర్వుల్లో కమిషన్ స్పష్టంగా చెప్పింది. ఈ ఉత్తర్వులను పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డికి పంపింది. ఎన్నిక ద్వారా అయినా తీర్మానం ద్వారా అయినా జగన్ మాత్రమే అద్యక్షుడిగా ఉంటారని అందరికీ తెలుసు. ఇది బహిరంగ రహస్యమే. అధ్యక్ష పదవికి మరో నాయకుడు పోటీ పడటం ఏ ప్రాంతీయ పార్టీలోనూ జరగదు. అయితే నిబంధనల ప్రకారం ఎన్నిక అనే తతంగం జరిపించాలి. తీర్మానం ద్వారా అద్యక్షుడి (అందులోనూ శాశ్వత అధ్యక్షుడు) నియామకం చెల్లదు.

కచ్చితంగా రెండేళ్ళకో లేదా మూడేళ్ళకో కమీషన్ విధించిన కాలపరిమితి ప్రకారమే అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సుంటుంది. కమిషన్  నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకుంటే తీవ్ర పరిణామాలుంటాయి. పార్టీని రిజస్టర్ చేసేటపుడే, గుర్తింపు తెచ్చుకునేటప్పుడే కేంద్ర ఎన్నికల కమీషన్ నియమ, నిబంధనలకు అనుగుణంగానే నడుచుకుంటామని డిక్లరేషన్ ఇవ్వాల్సుంటుంది. నిబంధనలను ఉల్లంఘించినట్లు కమిషన్ భావిస్తే సదరు పార్టీ గుర్తింపును రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఇదంతా వైసీపీ మేధావులకు తెలుసు. అంతర్గతంగా ఎన్నికల ప్రక్రియను చేపట్టాలి. అయితే ప్రతిసారి జగన్ నే అధ్యక్షుడిగా పార్టీ ఎన్నుకుంటే ఎలాంటి అభ్యంతరాలుండవు.

జరిగిన డామేజీని పూడ్చుకోవడానికి సజ్జల రంగంలోకి దిగాడు. జీవిత కాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్‌ను ఎన్నుకుంటూ జూలైలో జరిగిన ప్లీనరీలో చేసిన తీర్మానం ఆమోదం పొందలేదని చెప్పాడు. పార్టీ శాశ్వత అధ్యక్ష పదవిని సీఎం జగన్ తిరస్కరించారని (ఇది శుద్ధ అబద్ధం) అన్నాడు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం తెలుపుతూ స్పష్టత ఇవ్వాలని తమను కోరిందని తెలిపాడు. పార్టీ  జీవిత కాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఉండాలని జూలైలో జరిగిన ప్లీనరీలో తీర్మానం చేపట్టిన మాట వాస్తవమేనన్న ఆయన.. కార్యకర్తల కోరిక మేరకు తీర్మానం చేసినట్టు వివరించాడు. అయితే, ఆ పదవిని వైఎస్ జగన్ తిరస్కరించినందున తీర్మానం అమల్లోకి రాలేదన్నాడు.  

ప్లీనరీలో తీర్మానం ఆమోదం పొందలేదని, మినిట్స్‌లోనూ లేదన్నాడు. ఈసీకీ తాము ఏ తీర్మానాన్నీ పంపించలేదని చెప్పారు. జీవిత కాల అధ్యక్ష పదవి విషయమై స్పష్టత ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం అడిగినందున.. ప్రస్తుతం ఆ తీర్మానం అమల్లో లేదని ఈసీకి చెబుతామన్నారు. గత ఫిబ్రవరిలో పార్టీలో చేసిన సవరణ ప్రకారం వైఎస్ జగనే పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారన్నారు. ఐదేళ్ల పాటు తమ పార్టీ అధ్యక్షుడిగా అధ్యక్షుడుగా వైఎస్ జగన్ కొనసాగుతారంటూ.. అప్పట్లోనే ఈసీకి పంపామన్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?