నేల విడిచి సాము చేస్తున్న సీపీఎస్ ఉద్యోగులు!

జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉద్యోగుల కోసం జీపీఎస్ విధానాన్ని తీసుకువచ్చింది. ఓపీఎస్ తో దాదాపుగా సమానమైన లబ్ధి ఉండేలా దీనికి సంబంధించి విధివిధానాలు రూపొందిస్తామని ప్రభుత్వంలోని పెద్దలు హామీ ఇచ్చారు.  Advertisement నిజం చెప్పాలంటే,…

జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉద్యోగుల కోసం జీపీఎస్ విధానాన్ని తీసుకువచ్చింది. ఓపీఎస్ తో దాదాపుగా సమానమైన లబ్ధి ఉండేలా దీనికి సంబంధించి విధివిధానాలు రూపొందిస్తామని ప్రభుత్వంలోని పెద్దలు హామీ ఇచ్చారు. 

నిజం చెప్పాలంటే, సీపీఎస్ ద్వారా నష్టపోతున్న వారికి ఈ జీపీఎస్ అనేది పెద్ద వరం. దాదాపు ఏడాదిన్నర కాలంగా జరుగుతున్న చర్చలు, మంతనాలు, బుజ్జగింపులు పర్వం అనంతరం మొత్తానికి ప్రభుత్వం తొలుత ప్రకటించిన జీపీఎస్ విధివిధానాల్లో కూడా అనేక మార్పులు చేసి తాజాగా ఉద్యోగులకు ఎక్కువ లాభం చేకూరే హామీ ఇచ్చింది. దీనికి ఉద్యోగసంఘాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. విధివిధానాలు త్వరలో విడుదల చేస్తాం అని సర్కారులోని పెద్దలు ప్రకటించారు. ఈలోగా ఉద్యోగులు ఒక విపరీత నిర్ణయానికి రావడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

జీపీఎస్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించేది లేదని, సీపీఎస్ ను పూర్తిగా రద్దు చేసి, ఓపీఎస్ ను యథాతథంగా అమల్లోకి తెచ్చేదాకా పోరాటాన్ని కొనసాగిస్తాం అని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన జీపీఎస్ ను అంగీకరించిన ఉద్యోగ సంఘాల నేతల్లో ఒక్క సీపీఎస్ ఉద్యోగి కూడా లేరు అనేది వారి వాదన. నిజానికి వారి ప్రతినిధి నేరుగా ఉండాల్సిన అవసరం ఉందా, వారి ప్రతినిధి లేకపోతే.. ఆ వర్గం ఉద్యోగులకు మేలు జరిగే నిర్ణయం తీసుకున్నా కూడా వారు కాలదన్నుకుంటారా అనేది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న!

ఆంధ్రప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో ఓపీఎస్ ను అమలు చేయడం అనేది అసాధ్యం అని నిపుణులు చెబుతున్న మాట. ఆ నేపథ్యంలో జగన్ సర్కారు, సీపీఎస్ ఉద్యోగులకు వీలైనంత మేలు చేయడానికే ఎంతో మేథోమధనం తర్వాత.. జీపీఎస్ ను తీసుకు వస్తోంది. అయితే ప్రభుత్వం ఆ రూపంలో ఎలాంటి లబ్ధి ఇవ్వబోతోందో ఇంకా క్లారిటీ రాకముందే ఉద్యోగులు రభస ప్రారంభిస్తున్నారు. పోరాటం కొనసాగించి తీరుతాం అంటూ రాద్ధాంతం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఉద్యోగులు సంయమనంతో ఆలోచించాల్సి ఉంది.

సీపీఎస్ ఉద్యోగులు ప్రాక్టికాలిటీకి దూరంగా ఆలోచిస్తున్నట్టుగా, తమ చేజేతులా వ్యవహారాన్ని చెడగొట్టుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. జగన్ ను వ్యతిరేకించడం వల్ల వారు ఏం సాధిస్తారు. రాష్ట్రంలో ఏ ఇతర పార్టీ అయినా.. తాము అధికారంలోకి వస్తే.. ఓపీఎస్ అమల్లోకి తెస్తాం అని వారికి హామీ ఇస్తున్నదా? అనేది వారు ఆలోచించుకోవాలి. 

పవన్ లాంటి వాళ్లు ఉద్యోగులను ఎగదోయడానికి ప్రయత్నిస్తుంటారు తప్ప హామీ ఇవ్వరు. జగన్ హామీ ఇచ్చారు గనుక.. ఆ ప్రకారం చేయాల్సిందే అని పవన్ అంటారు.. అంతే తప్ప తమ ప్రభుత్వం వస్తే సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెస్తాం అనే మాట మాత్రం అనరు.

చంద్రబాబునాయుడు అసలు పెన్షన్ పథకం జోలికి వెళ్లారు. వాళ్లు చాలా లౌక్యంగా ఉద్యోగ సంఘాలను ఎగదోస్తున్నారు. వారి రాజకీయ కుట్ర క్రీడలో ఉద్యోగ సంఘాలు బలవుతున్నాయి. 

ఏ ఇతర పార్టీ అయినా వారికి అనుకూల హామీ ఇచ్చే విధంగా ఉంటే.. వారు పోరాటం కొనసాగిస్తాం అని బెదిరించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాంటి పరిస్థితి లేనప్పుడు.. ఈ పోరాటం వల్ల వారికి మరింత నష్టమే అని నిపుణులు అంచనా వేస్తున్నారు.