ఏపీ శాసన సభ కొత్త స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో వైసీపీ విషయంలో ఎలా వ్యవహరించబోతున్నారో చెప్పేశారు. స్పీకర్ గా నియమితులు అయిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కి ప్రతిపక్ష హోదా లేదని కాబట్టి జగన్ కి కూడా అందరి లాంటి సాధారణ సభ్యుడే అని స్పష్టం చేశారు. సాధారణ సభ్యుడికి ఇచ్చిన సమయమే ఆయనకు ఇస్తామని అయ్యన్న చెప్పడం విశేషం.
జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు అందరికీ మైకులు ఇవ్వడం అన్నది స్పీకర్ విచక్షణ మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రతిపక్ష హోదా లేకపోవడం వల్ల వైసీపీకి చాలా అవకాశాలు లేకుండా పోతున్నాయి. దాంతో స్పీకర్ ని మైక్ అడిగి ఆయన చాన్స్ ఇస్తే తీసుకోవాలి.
పైగా స్పీకర్ గా అయ్యన్నను ఎంపిక చేయడం వ్యూహాత్మకం అనీ అంటున్నారు. జగన్ మీద గత అయిదేళ్లలో ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన మీద పాతిక దాకా కేసులు కూడా ఉన్నాయి. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు జగన్ అన్నీ ఆలోచించే సభకు రాకుండా దూరంగా ఉండిపోయారా అన్న చర్చకు తెర లేస్తోంది.
సభలో అధికార పక్షం వైసీపీ అయిదేళ్ళ వైఫల్యాల మీదనే మాట్లాడుతుంటుంది. ఆ సమయంలో తమ వైపు నుంచి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడానికి వైసీపీకి పెద్దగా అవకాశాలు ఉండవని అంటున్నారు. స్పీకర్ గా అన్ని పార్టీలను సమానంగా చూస్తాను అని చెప్పిన అయ్యన్న రూల్స్ ప్రకారమే తాను ఫాలో అవుతాను అని అంటున్నారు. అలా చూస్తే వైసీపీని ప్రతిపక్ష హోదా దక్కని సాధారణ సభ్యుల జాబితాలోనే ఉంచుతారు.
జగన్ విషయంలో ఈ విధంగా కొత్త ప్రభుత్వం వైఖరి ఉంది అన్నది పసిగట్టే ఆయన సభకు దూరం అవుతున్నారు అని అంటున్నారు. అయితే జగన్ రాకపోయినా మిగిలిన ఎమ్మెల్యేలు సభకు వచ్చి ఉన్నంతలో ప్రజా సమస్యలు లేవనెత్తితే ఎంతో కొంత వైసీపీ వాయిస్ సభలో వినిపిస్తుంది అని అంటున్నారు.