పెద్దాయన పదోసారి… రిజల్ట్ ఏంటి?

ఉమ్మడి విశాఖ జిల్లాలో నర్శీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు గెలిచారు. ఆయన పదవ సారి పోటీ…

ఉమ్మడి విశాఖ జిల్లాలో నర్శీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు గెలిచారు. ఆయన పదవ సారి పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయనకు చివరి ఎన్నికలుగా చెప్పుకున్నారు. ఇటీవల జరిగిన పోలింగ్ తీరు చూస్తే వైసీపీ- టీడీపీల మధ్య ధాటీగానే పోటీ సాగింది అని అంటున్నారు. నర్శీపట్నంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 84 శాతం పైగా పోలింగ్ సాగింది.

దీంతో పెరిగిన ఓట్ల శాతం కలిసి వచ్చిందని ఇరు పార్టీలు అంచనా కడుతున్నాయి. తాను ఇరవై వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తాను అని వైసీపీ అభ్యర్ధి సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి టీడీపీకి భారీ మెజారిటీ రావడం ఖాయమని ఆ పార్టీ అంటోంది.

నర్శీపట్నంలో గెలుపు తమదంటే తమదని భారీగా సాగిన పోలింగ్ ని చూసి ఆయా పార్టీల నేతలు ఆశాభావంతో ఉన్నారు. ఏ గ్రామంలో ఎన్ని ఓట్లు తమకు వస్తాయన్న దాని మీద కూడా వారు తమకు ఉన్న అంచనాల ప్రకారం లెక్కలు వేసుకుంటున్నారు. మూడు మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉన్న నర్శీపట్నం నియోజకవర్గంలో నర్శీపట్నం మున్సిపాలిటీ కీలకంగా మారుతోంది. ఇక్కడ మెజారిటీ ఎవరికి వస్తే వారిదే విజయం.

అయ్యన్నపాత్రుడి తమ్ముడు వైసీపీలో ఉన్నారు. ఆయనకు మున్సిపాలిటీ మీద పట్టు ఉంది. దాంతో తమకే విజయం దక్కుతుందని వైసీపీ అంటోంది. కొత్త ఓటర్లు, ఉద్యోగులు, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు అంతా టీడీపీకి మద్దతుగా నిలిచారు అని చివరి ఎన్నికలు అన్న అయ్యన్న సానుభూతి మంత్రం పనిచేసిందని గెలుపు తమదే అని టీడీపీ అంటోంది. 

ఎవరు విజేత అన్నది తెలియదు కానీ రెండు పార్టీలు ధీమా మాత్రం వ్యక్తం చేస్తున్నాయి. అయ్యన్న గెలిస్తే చింతకాయల కుటుంబ రాజకీయం మరో అడుగు ముందుకు వేస్తుంది. ప్రతిష్ట తో పాటు రాజకీయ భవిష్యత్తు కూడా ఆ కుటుంబానికి ఈ ఎన్నికల ఫలితాల రూపంలో దక్కాల్సి ఉంది.