హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు, డాక్టర్ వైఎస్సార్ పేరు చేర్పు వ్యవహారంపై మొదట్లో వైసీపీ ఆత్మరక్షణలో పడింది. ఎన్టీఆర్ పేరు తొలగింపుపై ఒక దశలో తప్పు చేశామా? అని వైసీపీ నేతలు కూడా అనుకున్న పరిస్థితి. ఈ వ్యవహారంపై ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, వైఎస్ షర్మిల అభిప్రాయాలు వైసీపీకి బాగా నష్టం కలిగించాయి. చంద్రబాబు, లోకేశ్ తదితర టీడీపీ నేతల అభిప్రాయాల్ని రాజకీయ కోణంలో చూశారు. దీంతో వారి వల్ల వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదు.
ఎన్టీఆర్ తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు వైసీపీకి బాగా కలిసొచ్చింది. బాలయ్యకు ఎవరు సలహా ఇచ్చారో తెలియదు కానీ, ఆయన దివంగత వైఎస్సార్ పేరు తీసుకొచ్చి విమర్శించడం టీడీపీకి నష్టం కలిగించింది. దీంతో వైసీపీతో పాటు వైఎస్సార్ అభిమానులు ఘాటుగా స్పందించారు. తన తండ్రి ఎన్టీఆర్ గొప్పతనం గురించి బాలయ్య ఎంత చెప్పినా ఎవరూ పట్టించుకునే వాళ్లు కాదు.
కానీ వైఎస్సార్ గద్దెనెక్కి ఎయిర్‌పోర్ట్ పేరు మార్చాడని, ఆయన తనయుడు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మార్చారని బాలయ్య విమర్శించడంతో భూమరాంగ్ అయ్యింది. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పాలనలో కట్టిన ఎయిర్‌పోర్ట్‌కు రాజీవ్‌గాంధీ పేరు పెట్టారనే సంగతి అందరికీ తెలుసు. ఎన్టీఆర్ పేరు తొలగించడం అనేదే ఉత్పన్నం కాదు. కానీ ఏపీ అంటే ఎన్టీఆర్, టీడీపీ తప్ప … మరెవరూ మనుషులే కాదనే రీతిలో బాలయ్య “అతి” కాస్త రివర్స్ అయ్యింది.
ఎప్పుడైతే బాలయ్య దివంగత వైఎస్సార్‌ను కూడా విమర్శించారో, ఆ క్షణమే ఆయనపై ఎదురు దాడి మొదలైంది. అంత వరకూ ఎన్టీఆర్ పేరు తొలగించడాన్ని తప్పు పట్టిన వాళ్లు కూడా వైఎస్సార్‌ను వివాదంలోకి లాగడం ఏంటని నిలదీస్తున్నారు. బాలయ్య పోస్ట్ తమకు నష్టం కలిగించిందని టీడీపీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు.