ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమానికి సంబంధించి అతిథుల్లో ఆయన పేరు తప్పి పోయింది. ఇది పొరపాటా లేక ఉద్దేశ పూర్వకంగానే చేశారా? అనే చర్చకు తెరలేచింది. ఇటీవల తిరుపతిలో రాయలసీమ గర్జన పేరుతో భారీ ర్యాలీ, సభను విజయవంతంగా నిర్వహించిన నాయకుడిగా ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేరు మార్మోగింది. ఈ కార్యక్రమాన్ని ఆయన ఒంటి చేత్తో నిర్వహించారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక మండలి (అప్‌కాస్ట్) నేతృత్వంలో ఈ నెల 10, 11 తేదీల్లో గూడూరులో 30వ రాష్ట్రస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్-2022 నిర్వహించ తలపెట్టారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్న పర్యా వరణ, అడవులు, శాస్త్ర సాంకేతికశాఖ పరిధిలోకి అప్‌కాస్ట్ వస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, బొత్స సత్యనారాయణ, నారాయణస్వామి తదితరులు హాజరవుతున్నారు. అలాగే ముఖ్య, గౌరవ అతిథులుగా తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (చంద్రగిరి), వరప్రసాద్‌రావు (గూడూరు), కె.సంజీవయ్య (సూళ్లూరుపేట), ఆనం రామనారా యణరెడ్డి (వెంకటగిరి), బియ్యపు మధుసూదన్‌రెడ్డి (శ్రీకాళహస్తి), కె.ఆదిమూలం (సత్యవేడు), ఎమ్మెల్సీలు విఠపు బాలసు బ్రహ్మణ్యం, వాకాటి నారాయణరెడ్డి, యండవల్లి శ్రీనివాసురెడ్డి, కేఆర్‌టీ భరత్ పేర్లున్నాయి. భరత్‌ను మినహాయిస్తే మిగిలిన ఎమ్మెల్సీలంతా ప్రతిపక్ష పార్టీల వారే. ఈ జాబితాలో తిరుపతి జిల్లాలోని ఒక్క తిరుపతి ఎమ్మెల్యే తప్ప, మిగిలిన నియోజకవర్గాల ఎమ్మెల్యేల పేర్లున్నాయి.
భూమన కరుణాకరరెడ్డి పేరు మాత్రం లేకపోవడం రాజకీయంగా వివాదాస్పదమవుతోంది. అధికార పార్టీకి చెందిన వారెవరైనా ఉద్దేశ పూరితంగా ఆయన పేరు లేకుండా చేశారా? అనే అనుమానాలకు దారి తీసింది. డొక్కశుద్ధి ఉన్న ఎమ్మెల్యేల్లో భూమన పేరును ప్రముఖంగా చెబుతారు. అలాంటి నాయకుడితో రెండు మాటలు మాట్లాడిస్తే విద్యార్థులకు ప్రయోజనకరంగా వుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు ఆహ్వానితుల జాబితా తయారు చేస్తున్నప్పుడు …ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తారు. ఆరేడుగురు ఎమ్మెల్యేల పేర్లను కూడా సరి చూసుకోనంత బిజీలో అప్‌కాస్ట్ వుంటుందనుకోలేమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేని విస్మరించడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి మెంబర్ సెక్రటరీ డాక్టర్ వై.అపర్ణ ఏం సమాధానం చెబుతారో చూడాలి.