బీజేపీ నేతలతో పొంగులేటి కీలక భేటీ!

తెలంగాణలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరనున్నాడనే విషయం ఇప్పుడు హాట్ టాపి‌క్‌గా మారింది. నిన్న‌టి దాకా పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో వెళ్తున్నారంటూ వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో తాజాగా ఇవాళ…

తెలంగాణలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరనున్నాడనే విషయం ఇప్పుడు హాట్ టాపి‌క్‌గా మారింది. నిన్న‌టి దాకా పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో వెళ్తున్నారంటూ వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో తాజాగా ఇవాళ మధ్యాహ్నం పొంగులేటి నివాసంలో బీజేపీ చేరికల కమిటీతో స‌మావేశం కానున్నారు.

బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో చేరికల కమిటీ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రఘునందనరావు మరికొందరు బీజేపీ నాయకులు నేడు పొంగులేటిని తమ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇప్పటికే పలుమార్లు బీజేపీ చేరికల కమిటీ నేతలు ఆయ‌న్ను కలిశారు. నేడు పొంగులేటి పార్టీ మార్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

బీఆర్ఎస్ నుండి బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న్ను రాష్ట్రంలోని మిగ‌తా ప్ర‌ధాన పార్టీల నుండి ఆహ్వానాలు వ‌చ్చాయ‌ని.. కానీ ఏ పార్టీలో చేరనున్నార‌నేది సృష్ట‌త ఇవ్వ‌లేదు. కాక‌పోతే బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా చేయ‌ట‌మే త‌మ ఏకైక ల‌క్ష్య‌మ‌ని.. అందుకే ఏ పార్టీ అయితే స‌రైన‌దో దాంతోనే జ‌ట్టు క‌ట్టేందుకు త‌న‌తో పాటు త‌న‌ను న‌మ్ముకున్న మిగ‌తా నాయ‌కులు కూడా సిద్ధంగా ఉన్నార‌ని సృష్టం చేశారు.

కాగా పొంగులేటికి ఖ‌మ్మంలో మంచి కేడర్ ఉండటంతో.. తమ గూటికి చేర్చుకునేందుకు రాష్ట్రంలోని రెండు ప్రధాన జాతీయ‌ పార్టీల ముఖ్య‌ నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకంగా రాహుల్ గాంధీ టీమ్ స‌భ్యులే డైరెక్టుగా రంగంలోకి దిగి చర్చలు జరిపారు. మరోవైపు.. బీజేపీ తరఫున కూడా హోం మంత్రి అమిత్ షా పావులు కదుపుతున్నట్టు సమాచారం. తాజా బీజేపీ నేత‌ల స‌మావేశంతో పొంగులేటి కాంగ్రెస్‌లోకి వెళ్తారా.. బీజేపీ కండువా కప్పుకుంటారా అన్నది క్లారిటి వ‌చ్చే అవ‌కాశం ఉంది.