మహాభారతంలో శిఖండి పాత్ర గురించి అందరికీ తెలుసు. కురుక్షేత్ర సమయంలో భీష్మ పితామహుడి విల్లంబుల దాడికి పాండవ సైన్యం కకావికలం అవుతుంటోంది. భీష్ముడిని నిలువరించకపోతే యుద్ధంలో గెలవడం కష్టమని పాండవులు అందోళన చెందుతారు. దీంతో తాతగారైన భీష్ముడిని నిలువరించే ఉపాయం చెప్పాలని శ్రీకృష్ణుడిని పాండవులు వేడుకుంటారు. ఆడమగ కాని వ్యక్తిని భీష్ముని ఎదుట నిలబెడితే యుద్ధం చేయని సంగతిని పాండువుల చెవిన వేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో, పాండవులు ఎలా యుద్ధం గెలిచారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఏపీలో బీజేపీ ఎదుగుదల కాకుండా ఆ పార్టీలోనే శిఖండి ఉన్నాడు. అతనెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పేరుకు బీజేపీలో జాతీయ స్థాయి హోదా అనుభవిస్తున్నప్పటికీ, టీడీపీ ప్రయోజనాల కోసం పరితపించడం గురించి సొంత పార్టీలోనే కథలుకథలుగా చెప్పుకుంటుంటారు. విశాఖ గర్జన జరుగున్న నేపథ్యంలో ముఖ్యమంత్రికి సదరు శిఖండి ప్రేమ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. మూడున్నరేళ్ల పాలనలో ఎలాంటి పాలన అందించారో, ఎన్ని హామీలు పూర్తి చేశారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని శిఖండి నామధ్యేయ నాయకుడు సీఎంకు ఉచిత సలహాలు ఇవ్వడం విమర్శలకు దారి తీసింది.
ఎనిమిదిన్నరేళ్లుగా కేంద్రంలో అధికారం చెలాయిస్తూ, విభజన హామీలు ఎంత వరకూ నెరవేర్చారో ఆత్మపరిశీలన చేసుకోవాలని నెటిజన్లు హితవు చెబుతున్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులిచ్చారా? ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు, విశాఖకు రైల్వేజోన్, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు తదితర హామీలన్నీ విభజన చట్టంలో పొందుపరిచారని, ఎంత మాత్రం నెరవేర్చారో చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
విశాఖపై తెగ ప్రేమ కనబరుస్తున్న ఆ నాయకుడు… ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్‌పరం చేయడంపై ఏమంటారని సోషల్ మీడియాలో నిలదీయడం విశేషం. వర్తమాన పరిస్థితులను సీఎం దృష్టికి తెచ్చేందుకే ప్రేమ లేఖ రాస్తున్నట్టు బిల్డప్.
‘ మీ మానసిక ప్రవృత్తి, ఒంటెత్తు పోకడలు, అనుచిత అస్తవ్యస్త పరిపాలన… పర్యావసానంగా రాష్ట్ర రాజధాని ఏమిటో చెప్పలేని పరిస్థితిలో ప్రజలు అనాథలయ్యారు. వికేంద్రీకరణ ముసుగులో మీ మూడు ముక్కలాట అసలు రూపం అర్థమైంది. ఉత్తరాంధ్ర మాదిరిగానే రాయలసీమలో కూడా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రాయలసీమ డిక్లరేషన్ పేరుతో ఆ ప్రాంత బీజేపీ నేతలు కర్నూలులో సమావేశమై విడుదల చేసిన నివేదిక మాటేంటనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. కర్నూలులో హైకోర్టు, రాయలసీమలో అసెంబ్లీ సమావేశాలు, అలాగే రెండోరాజధాని తదితర డిమాండ్లను తీసుకొచ్చింది ఎవరిని రెచ్చగొట్టడానికో నీతులు చెబుతున్న ఆయన గారు సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.
ప్రధాని మోదీకి రాసిన లేఖను పొరపాటున ఏపీ సీఎం జగన్ అడ్రస్‌కు పంపినట్టున్నారే అని కొందరు నెటిజన్లు వెటకరిస్తున్నారు. ఏపీలో బీజేపీ ఎప్పటికీ ఎదగకూడదనే పట్టుదలతో సొంత పార్టీ జాతీయ నాయకుడు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారనే సెటైర్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి.