ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ, ఎల్లో మీడియా భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అస్త్రాన్ని ప్రయోగించాలని వ్యూహం వేశాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను అడ్డు పెట్టుకుని సెంటిమెంట్ రాజకీయాన్ని రగిల్చి పబ్బం గడుపుకోవాలనే కుట్రలకు తెరలేపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా జగన్‌కు రాజకీయ లబ్ధి కలిగించేందుకు ఏపీలో టీడీపీని కేసీఆర్ టార్గెట్ చేశారనే కొత్త పల్లవిని ఎల్లో మీడియా అందుకుంది.
ఈ రకమైన ప్రచారానికి ఎల్లో మీడియా దిగడం వెనుక టీడీపీకి ప్రయోజనం కలిగించే ఉద్దేశం దాగి వుంది. ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకి అయిన కేసీఆర్ ఏపీలో జగన్‌కు అండగా ఉన్నారనే సంకేతాల్ని పంపి, తద్వారా ప్రాంతీయ సెంటిమెంట్ రగిల్చి చంద్రబాబుకు రాజకీయ లబ్ధి కలిగించడమే ఎజెండాగా కనిపిస్తోంది. ఇదే సందర్భంలో జనం మరో రకంగా అర్థం చేసుకుంటారని పచ్చదళం అంచనా కట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
టీడీపీ మాత్రమే కేసీఆర్ టార్గెట్ అని ప్రచారం చేయడం ద్వారా తమకు తాముగానే పార్టీని బలహీనపరుస్తున్నామనే వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ జాతీయ పార్టీలోకి ఏపీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు వుంటాయని, అది కూడా టీడీపీ వాళ్లే వెళ్తారని ఎల్లో మీడియా ఊదరగొడుతోంది. తద్వారా టీడీపీకి ఏపీలో భవిష్యత్ లేదని, ప్రత్యామ్నాయ వేటలో ఆ పార్టీ నాయకులు ఉన్నారనే భావన ప్రజల్లో పెరుగుతోంది. ఎన్నికల ముంగిట ఇది ఎంత ఎక్కువ ప్రచారం జరిగితే, అంతగా ఆ పార్టీకి నష్టమనే సంగతి గ్రహించకపోవడం విస్మయం కలిగిస్తోంది.
హైదరాబాద్‌లో భారీగా ఆస్తులు కూడగట్టుకున్న ఏపీ నేతల్ని నయాన్నో, భయాన్నో బీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్‌తో జగన్‌కు సన్నిహిత సంబంధాలు ఉండడం, అలాగే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరేందుకు ఎవరూ ఆసక్తి చూపరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ స్థాపించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటో మరికొంత కాలం జరిగితే తప్ప తెలిసే అవకాశం లేదు. ఈ లోపు తొందరపడి ఆ పార్టీలోకి ఏపీ నుంచి వెంటనే వెళ్తారని ఎవరూ అనుకోరు.
2018లో చంద్రబాబును చూపి సెంటిమెంట్ రాజేసి కేసీఆర్ రెండో సారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2024లో ఏపీలో బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ రాకను అడ్డుపెట్టుకుని, సెంటిమెంట్ రగిల్చి అధికారాన్ని దక్కించుకోవాలని చంద్రబాబు వ్యూహం వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇదే పని 2019లో కూడా చంద్రబాబు చేశారు. అయినా ప్రయోజనం లేదు. జగన్‌పై మరేది లేనట్టు, ప్రజల్లో లేని అంశాల్ని తలకెత్తుకుని అర్థం లేని ఆలోచనలు టీడీపీ చేస్తోంది. అదే ఆ పార్టీకి ఎదుగుదలకు అడ్డంకిగా మారింది.