రాజధానిలో పేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయత్నం ఓ కొలిక్కి వచ్చింది. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం చేసిన చట్టసవరణలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. గవర్నర్ నిర్ణయం అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కంటిపై నిద్ర కరువు చేసేలా వుంది. తమ మధ్యకు పేదలొస్తే భూములకు విలువ ఉండదని వారు వాదిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో వివిధ వ్యవస్థల నుంచి అవరోధాలు ఎదురైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం పేదలకు రాజధానిలో నివాసం కల్పించాలన్న పోరాటాన్ని ఆపలేదు. సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టాల సవరణకు ఆమోద ముద్ర వేస్తూ గవర్నర్ పేరుతో ఇవాళ నోటిఫికేషన్ జారీ అయ్యింది.
రాజధాని అమరాతిని పూర్తిగా ధ్వంసం చేసేందుకే జగన్ చట్టసవరణలకు పాల్పడ్డారనే విమర్శ ప్రత్యర్థుల నుంచి వస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అమరావతిలో ఇంటి స్థలాలు ఇవ్వడం ఏంటనే నిలదీతలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రలో భాగమే అని వారు విమర్శిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని వారే కాకుండా ఇతర జిల్లాల్లో అర్హులైన వారికి కూడా అమరావతిలో ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చట్టసవరణ చేసిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా సీఆర్డీఏ చట్ట సవరణ, అలాగే మాస్టర్‌ప్లాన్‌లో మార్పుచేర్పులు చేసేందుకు నోటీఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. వీటికి తాజాగా గవర్నర్ ఆమోద ముద్ర వేయడం విశేషం. దీంతో అర్హులైన పేదలకు రాజధానిలో ఇళ్లు, స్థలాలు కేటాయించేందుకు మార్గం సుగుమమైంది. ఇకపై ఆ పనిని ప్రభుత్వం శరవేగంగా చేపట్టే అవకాశాలున్నాయి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున వైసీపీ మద్దతుదారులను ఓటర్లుగా చేర్చేందుకుఉపయోగపడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని ఉద్యమించిన వారి పరిస్థితి ఏంటనేది చర్చకు తెరలేచింది.