ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పర్యటనలో కీలక మంత్రి గుడివాడ అమర్నాథ్ కనిపించకపోవడం హాట్ డిస్కషన్ గా ఉంది. ముఖ్యమంత్రి విశాఖ వచ్చిన సందర్భంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మరో మంత్రి బూడి ముత్యాలనాయుడు, ఇంచార్జి మంత్రి విడదల రజని, సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, క్రీడల మంత్రి ఆర్కే రోజా తదితరులు హాజరయ్యారు.
కానీ జగన్ తో అత్యంత సాన్నిహిత్యం నెరిపే మంత్రిగా పేరున్న గుడివాడ మాత్రం కనిపించలేదు. గుడివాడకు ఇప్పటిదాకా టికెట్ అన్నది ఎక్కడా ప్రకటించలేదు. ఆయనకు పార్టీ పని కోసం ఉపయోగించుకుంటారు అన్నట్లుగా విశాఖ రీజియన్ వైసీపీ డిప్యూటీ కో ఆర్డినేటర్ పదవిని ఇచ్చారు.
గత కొన్ని రోజులుగా గుడివాడ మీడియాకు సైతం కనిపించడంలేదు అని అంటున్నారు. ఆయన మనసులో ఏముందో తెలియదు కానీ విశాఖలో జగన్ పక్కన గుడివాడ లేకపోవడం మాత్రం వైసీపీతో పాటు రాజకీయాల్లోనూ ఆసక్తికరమైన చర్చకు తావు ఇచ్చినట్లు అయింది.
తన జాతకం జగన్ రాస్తారని తాను ఎక్కడ పోటీ చేయాలన్నది ఆయనే నిర్ణయిస్తారని ఇటీవల కాలం వరకూ గుడివాడ చెబుతూ వచ్చారు. తనకు టికెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేయమన్నా చేస్తాను అని ప్రకటించారు. తాను పార్టీ కోసం జగన్ ని మరోమారు సీఎం చేయడం కోసం ఏమైనా చేస్తాను అని గుడివాడ అన్నారు.
ఆయన జగన్ కి వీర విధేయుడుగా ఉన్నారు. అటువంటి గుడివాడ ముఖ్యమంత్రి విశాఖ జిల్లా పర్యటనలో కనిపించకపోవడం అనుమానాలు దారి తీస్తోంది. మంత్రికే టికెట్ ఇవ్వడంలేదు అంటూ జనసేన టీడీపీ నేతలు అపుడే విమర్శలతో గొంతు పెంచుతున్నారు.
గుడివాడకు టికెట్ రాదు అని జోస్యం చెప్పే ప్రత్యర్ధులు కూడా తయారు అయ్యారు. గుడివాడకు ఎంపీ టికెట్ ఇస్తారని అంటున్నా ఆయన ఎమ్మెల్యే కోసం పట్టుబడుతున్నారని మరో ప్రచారం సాగుతోంది. ఏడవ విడత జాబితాలో గుడివాడ రాజకీయం ఏమిటి అన్నది తెలుస్తుంది అని అంటున్నారు.