ఇది నా సొంత గడ్డ… పవన్ అయినా ఓడిస్తా!

పవన్ కళ్యాణ్ వచ్చినా ఓడించి తీరుతాను అంటున్నారు వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఆయనను వైసీపీ గాజువాక ఇంచార్జిగా నియమించింది. దాంతో వచ్చే ఎన్నికల్లో ఆయన అక్కడ నుంచి పోటీ చేయడానికి మార్గం సుగమం…

పవన్ కళ్యాణ్ వచ్చినా ఓడించి తీరుతాను అంటున్నారు వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఆయనను వైసీపీ గాజువాక ఇంచార్జిగా నియమించింది. దాంతో వచ్చే ఎన్నికల్లో ఆయన అక్కడ నుంచి పోటీ చేయడానికి మార్గం సుగమం అయింది.

గాజువాక గుడివాడ సొంత నియోజకవర్గం. ఆయన సొంత ఊరు మింది గాజువాక పరిధిలో ఉంది. దాంతో అక్కడ నుంచే పోటీ చేయమని వైసీపీ అధినాయకత్వం ఆదేశించింది. 2019లో అనకాపల్లి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన గుడివాడ ఈసారి గాజువాక నుంచి పోటీ చేస్తున్నారు.

గాజువాక ఒకపుడు పెందుర్తి నియోజకవర్గంలో ఉండేది. పెందుర్తి 1979లో ఏర్పడింది. మొదటి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తాత గుడివాడ అప్పన్న. 1989లో అదే సీటు నుంచి అమర్నాథ్ తండ్రి గురునాధరావు పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత మంత్రి కూడా అయ్యారు. అలా తాత తండ్రుల సీటులో ఇపుడు తాను పోటీ చేస్తున్నాను అని గుడివాడ ఆనందం వ్యక్తం చేశారు.

తన సొంత గడ్డ మీద నుంచి పోటీ పడుతున్నాను పవన్ కళ్యాణ్ సహా ఎవరు ప్రత్యర్ధి అయినా విజయం తనదే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగన్ పట్ల ప్రజలలో ఉన్న ఆదరణ తనను గెలిపిస్తుందని ఆయన అంటున్నారు.

గాజువాక పరిధిలో స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తామని చెబుతున్న బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయని ఈ పార్టీలకు స్టీల్ కార్మికులు బుద్ధి చెబుతారని గుడివాడ అంటున్నారు. పవన్ కళ్యాణ్ జనసైనికులను మోసం చేశారని, ఇక పవన్ రాజకీయ జీవితాన్ని చంద్రబాబు పూర్తిగా నాశనం చేశారని మంత్రి సంచలన కామెంట్స్ చేశారు.

గాజువాకలో గుడివాడ గెలుపునకు అవకాశాలు మెరుగుపడ్డాయని వైసీపీ నేతలు అంటున్నారు. తనకు తండ్రి కాలం నుంచి ఉన్న అభిమాన బంధుగణం ఉంది. దాంతో పాటు కాపు సామాజిక వర్గం ఈసారి వైసీపీకి అనుకూలం అవుతుంది అని అంటున్నారు. టీడీపీ ఈ సీటు తీసుకుని వేరే సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని నిలబెడుతుందని దాంతో వైసీపీకి అది కలసి వస్తుందని అంటున్నారు.