ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత చాలా స్పష్టమైన ఆదేశాలను పదేపదే ఇస్తున్నారు. ఆ ఆదేశాలు ఏంటంటే… పోలీసుల్లో ఇంకా పాత బ్లడ్ వుంటే పక్కకు తప్పుకోవాలని. అంటే గత ప్రభుత్వ అనుకూల పోలీస్ అధికారులు, పోలీసులు వుంటే, ఏకంగా ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లిపోవాలని ఆమె తేల్చి చెబుతున్నారు. ఇందులో మొహమాటం లేదని ఆమె స్పష్టం చేయడం గమనార్హం.
హోంశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనిత మీడియాతో మాట్లాడుతూ మరోసారి వైసీపీకి అనుకూలమైన అధికారులెవరైనా వుంటే తప్పుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర ప్రజల దయ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆశీస్సులతో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టానన్నారు. సామాన్య టీచర్ అయిన తనను హోంమంత్రిగా చేసిన పాయకరావుపేట ప్రజలందరికీ ధన్యవాదాలన్నారు.
గత ఐదేళ్లలో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని అనిత అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో జీవించేలా శాంతిభద్రతలు అదుపులో వుంటాయన్నారు. ప్రజలకు అనుకూలంగా పోలీసులు పని చేయాలని ఆమె సూచించారు. ఖాకీ డ్రెస్‌కు గౌరవం తెచ్చేలా పోలీసులు నడుచుకోవాలని అనిత హితవు చెప్పడం విశేషం.
సోషల్ మీడియాలో మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అనిత హెచ్చరించారు. కావున ఇకపై సోషల్ మీడియాలో ఏవైనా పోస్టులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వుండాలని అనిత హెచ్చరిక చెప్పకనే చెబుతోంది. అలాగే రాజకీయాలకు అతీతంగా అనిత సారథ్యంలో పోలీసులు న్యాయానికి కొమ్ము కాస్తారని ఆశిద్దాం.