వాలంటీర్లను కించపరిచేలా దూషించిన జనసేనాని పవన్‌కల్యాణ్‌పై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. రెండో దఫా వారాహియాత్రలో భాగంగా ఏలూరులో నిర్వహించిన బహిరంగ సభలో వాలంటీర్లపై నోటికొచ్చినట్టు తిట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మహిళా కమిషన్‌కు భారీగా ఈమెయిల్స్ ద్వారా మహిళా సంఘాలు, వాలంటీర్లు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ విషయాన్ని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు.
మహిళల అక్రమ రవాణాకు వాలంటీర్లు పాల్పడుతున్నారని తనకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని పవన్ కామెంట్స్‌పై వాసిరెడ్డి పద్మ ఫైర్ అయ్యారు. పవన్‌కు నోటీసులు జారీ చేసినట్టు ఆమె వెల్లడించారు. పది రోజుల్లోపు సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వాలంటీర్లపై పవన్ విషం కక్కుతున్నారని, ఆయనకు ఏ ఇంటెలిజెన్స్ అధికార చెప్పారో సమాధానం చెప్పాలని కోరారు.
ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి పవన్ తప్పించుకోలేరన్నారు. వాలంటీర్లకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని వాసిరెడ్డి పద్మ అనుమానం వ్యక్తం చేశారు. యువత చెడిపోవడానికి పవన్ సినిమాలే కారణమని ఆమె చెప్పుకొచ్చారు. పవన్ వ్యాఖ్యలతో వారాహి యాత్ర ఎపిసోడ్ మొత్తం పక్కదారి పట్టింది.
వైసీపీకి అనవసరంగా ఆయుధం ఇచ్చినట్టైంది. పవన్ రాజకీయ అజ్ఞానాన్ని ఆయన మాటలు తెలియజేస్తున్నాయనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. చివరికి పవన్‌ను అభిమానించే వాళ్లు కూడా వాలంటీర్లపై చేసిన కామెంట్స్‌ను తప్పు పడుతున్నారు.