జ‌గ‌న్ దిగిపోయాడు.. ధ‌ర‌లు పెరిగాయేంద‌బ్బా!

నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు వైఎస్ జ‌గ‌నే కార‌ణ‌మ‌ని మొన్న‌టి వ‌ర‌కూ విస్తృతంగా ప్ర‌చార‌మైంది. సంక్షేమ ప‌థ‌కాల‌కు పంచ‌డానికి డ‌బ్బు స‌మ‌కూర్చుకోడానికి నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌ల్ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం పెంచుతూ పోతోంద‌ని విప‌రీతంగా ప్ర‌చారం…

నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు వైఎస్ జ‌గ‌నే కార‌ణ‌మ‌ని మొన్న‌టి వ‌ర‌కూ విస్తృతంగా ప్ర‌చార‌మైంది. సంక్షేమ ప‌థ‌కాల‌కు పంచ‌డానికి డ‌బ్బు స‌మ‌కూర్చుకోడానికి నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌ల్ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం పెంచుతూ పోతోంద‌ని విప‌రీతంగా ప్ర‌చారం చేశారు. నిజ‌మే అని న‌మ్మిన ప్ర‌జలున్నారు. ఈ ప్ర‌చారంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు వ్య‌తిరేక‌త పెంచుకున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాల గురించి అంద‌రికీ తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో నిత్యావ‌స‌ర స‌రుకులు, అలాగే కూర‌గాయ‌ల ధ‌ర‌లు పెర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గ‌త నెల‌లో కిలో రూ.20 నుంచి రూ.25 ప‌లికిన టమోటా ధ‌ర‌లు… నెల తిరిగ‌క‌నే ధ‌ర ఐదింత‌లు పెర‌గ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ప్ర‌తి ఒక్క‌రూ నిత్యం వాడే ఉల్లి మే నెల‌లో రూ.100కు మూడు కిలోలు చొప్పున జ‌నం కొన్నారు. ఇప్పుడు మూడు కిలోల ఉల్లి కొనాలంటే రూ.200 ఇవ్వాల్సిన ప‌రిస్థితి. అలాగే ప‌చ్చిమిర‌ప కాయ‌ల ధ‌ర కూడా అంతే. గ‌త నెల‌లో ర‌కాన్ని బ‌ట్టి కిలో క‌నిష్ట ధ‌ర రూ.35 వుంటే, గ‌రిష్టంగా రూ.55 ప‌లికింది. ఇప్పుడు క‌నిష్టం రూ.45, గ‌రిష్టం రూ.80 ప‌లుకుతోంది.

ఇలా ఏ స‌రుకు తీసుకున్నా ధ‌ర‌లు ఆకాశాన్ని తాకుతున్నాయి. వంద నోటుకు విలువే లేకుండా పోయింది. రెండు మూడు ర‌కాల కూర‌గాయ‌లు కొనాలంటే నాలుగైదు వంద‌ల రూపాయిలు ఖ‌ర్చు చేయాల్సిన ప‌రిస్థితి. అప్పుడంటే స‌రుకులు, కూర‌గాయ‌ల ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు జ‌గ‌న్ కార‌ణ‌మ‌ని విమ‌ర్శించారు. మ‌రి ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం దిగిపోయింది క‌దా! ధ‌ర‌ల పెరుగుద‌ల పాపం ఎవ‌రి నెత్తిన వేస్తారో చూడాలి.