ఈ నెల 22న వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరినీ ఆహ్వానించారు. వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో నిర్వహిస్తున్న విస్తృతస్థాయి సమావేశానికి ప్రాధాన్యం వుంది. కీలక సమావేశం కావడంతో జగన్ ఏం చెబుతారో అనే ఉత్సుకత ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో వుంది.
ఇదే సందర్భంలో వైఎస్ జగన్ ఎప్పట్లా తను మాత్రమే మాట్లాడ్డాన్ని ఇకపై తగ్గించాలని వారు కోరుకుంటున్నారు. దారుణమైన ఫలితాలు రావడానికి దారి తీసిన పరిస్థితుల గురించి అభ్యర్థులు ఏం చెబుతారో వినాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇంతకాలం జగన్ చెప్పిందే తాము పాటించామని, కనీసం ఇప్పుడైనా తాము చెప్పింది జగన్ వినాలని , తప్పులెక్కడ జరిగాయో తెలుసుకుని సరిదిద్దుకోడానికి ఇదే మంచి అవకాశమని వైసీపీ అభ్యర్థులు అంటున్నారు.
గత ఐదేళ్లలో జగన్ ఎప్పుడూ ఎవరి మాట వినలేదని వారు గుర్తు చేస్తున్నారు. ప్రతి సమావేశంలోనూ ఆయన మాటల్ని వినడం తప్ప, నోరు తెరిచి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో చెప్పే అవకాశం రాలేదని వారు అంటున్నారు. ఒన్ మ్యాన్ షో వల్లే వైసీపీ దారుణంగా దెబ్బతిన్నదని వారు అభిప్రాయపడుతున్నారు. ఏ పార్టీలో అయినా భిన్నాభిప్రాయాలకు చోటు వుండాలని, అప్పుడే ప్రజాస్వామ్యం బతికి వుంటుందని వైసీపీ అభ్యర్థులు చెబుతున్నారు.
వైఎస్ జగన్‌లో పెద్ద లోపం… ఇతరుల అభిప్రాయాల్ని తీసుకోకపోవడమే అని చెబుతున్నారు. ప్రతి సమావేశంలోనూ జగనే ప్రధాన వ్యక్తగా తాను ఏం చెప్పదలుచుకున్నారో చెప్పేసి, వెళ్లిపోవడం ఆనవాయితీగా వచ్చిందని వారు అంటున్నారు. ఇప్పటికైనా వైసీపీ సమావేశాల నిర్వహణ తీరులో మార్పు రావాలని ఆ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. అభిప్రాయాల్ని వెల్లడించడానికి ఏ మేరకు అవకాశం ఇస్తారో చూడాలి.