తిరుపతిలో మెజార్టీ బలిజలకు ఉన్నట్టుండి కోపం వచ్చింది. ఇందుకు కారణం ఆ సామాజిక వర్గానికి చెందిన కొందరు అధికార పార్టీలో చేరుతుండడమే. సినిమాల పరంగా మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, వారి కుటుంబాల్లోని హీరోలకు తిరుపతిలో వీరాభిమానులున్నారు. తిరుపతిలో బలిజ సామాజిక వర్గానిది కీలకపాత్ర అనడంలో సందేహం లేదు. అలాగని మొత్తం రాజకీయం అంతా వారిదే అనడంలో వాస్తవం లేదు.
బలిజలకు కొంచెం అటుఇటుగా రెడ్డి సామాజిక వర్గం కూడా వుంది. అలాగే యాదవులు, దళితులు, మైనార్టీల ఓట్లను తక్కువ అంచనా వేస్తే తప్పులో కాలేసినట్టే. కొన్ని రోజులుగా కొందరు కాపు నాయకుల పేరుతో రాజకీయాలు మాట్లాడుతున్నారు. తమ సామాజిక వర్గాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అణిచివేస్తోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. పోలీసులు, టీటీడీ అధికారులను అడ్డు పెట్టుకుని తమ సామాజిక వర్గానికి చెందిన నేతల్ని వైసీపీలో చేర్చుకుంటున్నారని ఆరోపించడం చర్చకు దారి తీసింది.
బలిజలు ఏ రాజకీయ పార్టీకి బానిసలు కాదని చెప్పడం గమనార్హం. బలిజ సామాజిక వర్గానికి చెందిన పవన్‌కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని, తమ మద్దతు ఆయనకే అని తేల్చి చెప్పారు. ఇందుకు కాపు సేన నాయకుల్ని తప్పక అభినందించాలి. ఎందుకంటే ఇంతకాలం తిరుపతిలో బలిజ నాయకులు టీడీపీకి ఊడిగం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నేతృత్వంలో ఇప్పటికీ మెజార్టీ బలిజ నాయకులు ప్రధాన ప్రతిపక్షానికి బానిసలుగా కొనసాగుతున్నారని ఆ సామాజిక వర్గం నుంచి విమర్శలున్నాయి.
తిరుపతి బలిజ సామాజిక వర్గం చైతన్యవంతం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ముందు తాము ఎవరికి ఊడిగం చేస్తున్నామో గ్రహించాలి. టీడీపీ బానిసత్వం నుంచి తిరుపతిలో ఆ సామాజిక వర్గం బయటపడాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత అధికార పార్టీ అణిచివేతపై పోరాటం చేయొచ్చు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఆమె అల్లుడు సంజయ్ తమ సొంత ప్రయోజనాల కోసం సామాజిక వర్గాన్ని పావుగా వాడుకుంటున్నారనే వాస్తవాన్ని ఇప్పటికైనా కాపుసేన నాయకులు గుర్తించడం మంచి పరిణామం.
మా ఓట్లు- మా పార్టీ అనే భావన బలిజల్లో వస్తుండడంతో టీడీపీ వెన్నులో వణుకుపుడుతోంది. మరోవైపు సామాజిక వర్గం ఓట్లు చూపి టీడీపీ వద్ద రాజకీయ పబ్బం గడుపుకుంటున్న వాళ్ల రాజకీయ ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు తిరుపతిలో నెలకున్నాయి. మరోవైపు తిరుపతి బలిజలు జనసేన వైపు చూస్తుండడం ఆ పార్టీకి కొండంత బలాన్ని ఇస్తోంది. మొత్తానికి తిరుపతిలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకుకు చిల్లు పడుతున్న వాతావరణం నెలకుంది.