పవన్‌కల్యాణ్ నేతృత్వంలోని జనసేన రోజురోజుకూ జనానికి దూరవమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిత్యం ప్రజల్లో ఉండాల్సిన జనసేన… ఆశ్చర్యకరంగా దూరంగా ఉంటోంది. గత కొన్ని రోజులుగా జనసేన వైపు నుంచి ఎలాంటి కార్యక్ర మాలు లేవు. ఆ మధ్య జనవాణి, దెబ్బతిన్నరోడ్లపై సోషల్ మీడియా వేదికగా వార్ అంటూ జనసేన హడావుడి చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాలు కావడంతో ఎల్లో మీడియా ప్రాధాన్యం ఇచ్చింది.
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం పేరుతో పవన్ జనంలోకి వెళ్లారు. బహిరంగ సభల్లో మాట్లాడారు. సహజంగానే జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుపతి, కడపలలో సమావేశాల తర్వాత పవన్ ప్రజలకు కనిపించలేదు. అడపాదడపా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మినహా, ప్రత్యక్షంగా ఆయన జనం మధ్యలోకి రాలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతానని ప్రగల్భాలు పలకడం తప్ప, అందుకు తగ్గట్టుగా పవన్‌కల్యాణ్ ఏం చేస్తున్నారనే ప్రశ్న వినిపిస్తోంది. నిత్యం సినీ షూటింగ్‌ల్లో బిజీగా వుండే పవన్‌కల్యాణ్, ఎవరి కోసమో అప్పుడప్పుడు రాజకీయంగా స్పందిస్తుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా ఏమైనా అనుకుంటారని తప్పితే, ప్రజల కోసం పని చేయాలనే నిబద్ధత ఆయనలో మచ్చుకైనా కనిపించడం లేదనే విమర్శ వుంది.
జగన్‌ను ఎదుర్కోవాలంటే తన అవసరం టీడీపీకి ఉందని, అదే తనకు కలిసి వస్తుందనే నమ్మకంతో పవన్ ఉన్నారు. టీడీపీ బలపడితే చాలు, తాను కూడా స్ట్రాంగ్‌గా ఉన్నట్టే అని ఆయన అనుకుంటున్నారు. ఇక మిత్రపక్షమైన బీజేపీతో రాజకీయ సంబంధాలేంటో పవన్‌కల్యాణ్‌కే తెలియదు.
బీజేపీతో పొత్తుపై పవన్‌కు క్లారిటీ లోపించింది. అందుకే ఆ విషయమై ఆయన ఎప్పుడూ మాట్లాడరు. మరోవైపు తన తమ్ముడు పాలకుడు కావాలని మెగాస్టార్ చిరంజీవి కోరుకుంటున్నారు. ఇలాగైతే పాలకుడు కావడం దేవుడెరుగు, కనీసం ఎమ్మెల్యేగా గెలుస్తారా? అనేది పెద్ద ప్రశ్న.