జగన్ వ్యూహంపై పవన్ వణుకు.. అజ్ఞాన ప్రదర్శన!

జనసేన పార్టీకి సంబంధించినంత వరకు నాదెండ్ల మనోహర్ మాటలు వేరు, పవన్ కల్యాణ్ మాటలు వేరు అనుకోవడానికి వీల్లేదు. పవన్ కల్యాణ్ షూటింగుల్లో బిజీగా ఉన్నప్పుడు, ఆయనకు మాట్లాడడానికి తీరిక లేనప్పుడు ఆయన మనసులోని…

జనసేన పార్టీకి సంబంధించినంత వరకు నాదెండ్ల మనోహర్ మాటలు వేరు, పవన్ కల్యాణ్ మాటలు వేరు అనుకోవడానికి వీల్లేదు. పవన్ కల్యాణ్ షూటింగుల్లో బిజీగా ఉన్నప్పుడు, ఆయనకు మాట్లాడడానికి తీరిక లేనప్పుడు ఆయన మనసులోని మాటలనే నాదెండ్ల మనోహర్ మాట్లాడుతుంటాడు. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి తన పార్టీని పటిష్టం చేసుకోవడానికి, ఎన్నికలను ఎదుర్కోవడానికి ఒక బలమైన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటే ఆ వ్యూహం పట్ల వారిలో వణుకు పుట్టినట్టుగా కనిపిస్తోంది. అందుకే అసలు జగన్ వ్యూహం ఏమిటనేది పూర్తిగా తెలుసుకోకుండానే.. దానిపై చెత్త విమర్శలు చేస్తున్నారు.

ఎన్నికలను ఎదుర్కొనే దిశగా పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా.. ప్రతి వార్డు, గ్రామ సచివాలయం పరిధిలో.. ప్రతి యాభై ఇళ్లకు ఇద్దరేసి వంతున గృహసారథులను నియమించాలని జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ నిర్ణయం పట్ల పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ఈ రకంగా రాష్ట్రంలో ఐదులక్షలమందికి పైగా గృహసారథులను నియమించాలనేది జగన్ వ్యూహం. 

ప్రతి యాభై ఇళ్లకు ఒక మగ, ఒక ఆడ ఈ గృహసారధులుగా ఉంటారు. తమ పరిధి అన్ని ఇళ్లలోని కుటుంబాలతో నిత్యం టచ్ లో ఉంటూ, వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ పరంగా అందించగల సాయం గురించి వారు ప్రయత్నిస్తారు. వీరు క్షేత్రస్థాయిలో ఆ యాభై ఇళ్లలోనే నివసించే వారే అయి ఉంటారు కాబట్టి.. ఏ ఒక్క కుటుంబంలో ఏ చిన్న సమస్య ఉన్నా అది వారి దృష్టికి రాకుండా పోదు. ప్రభుత్వ పరంగా పరిష్కరించగలిగేది అయితే పరిష్కరించేలా తోడ్పడతారు. ఈ గృహసారధుల ఏర్పాటు పార్టీకి ప్రజలతో అనుబంధాన్ని కూడా పెంచుతుందనే నమ్మకం పార్టీలో కూడా ఏర్పడింది. 

అయితే ఈ గృహసారధుల నియామకం అనేది పూర్తిగా పార్టీ పరమైన ఏర్పాటు మాత్రమే. ఇప్పటికే ప్రతి యాభై ఇళ్లు యూనిట్ గా పనిచేయడానికి వాలంటీర్ల వ్యవస్థ ఉంది. అయితే వాలంటీర్లను పార్టీకోసం వాడుకుంటున్నారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో తమకు అలాంటి అవసరం లేదని పార్టీ స్పష్టం చేయదలచుకుంది. అందుకే జగన్ ఈ గృహసారథుల ఆలోచన చేశారు. వాలంటీర్లు- ప్రభుత్వంలో భాగం కాగా, ఈ గృహసారధులు పార్టీ యంత్రాంగం మాత్రమే. వారందరూ పార్టీ క్రియాశీల కార్యకర్తలుగా ఉంటారు. వారు పార్టీకి మేలు చేస్తున్నందుకు గాను వారికి జీవిత బీమా చేయించడం ఇతర సంక్షేమం గమనించడం పార్టీ చూసుకుంటుంది. 

అయితే ఈ వ్యవస్థ, వ్యూహం ప్రజలపై బాగా పనిచేస్తుందని తెలిసి జనసేన పార్టీ ఓర్వలేకపోతున్నట్టుంది. గృహసారధుల నియామకం అనేది ప్రజాస్వామ్యబద్ధం కాదని నాదెండ్ల మనోహర్ అంటున్నారు. ఒక రాజకీయ పార్టీ తమకు క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటుచేసుకుంటే.. క్షేత్రస్థాయిలో సామాన్యులకోసం పనిచేయడానికి పార్టీ కార్యకర్తలకు నియమిత బాధ్యతలను అప్పజెబితే అందులో ప్రజాస్వామ్యబద్ధం కాకపోవడం ఏమిటో అర్థం కాని సంగతి. 

ఈ వ్యవస్థలో నిరంకుశత్వం ఏమున్నదో నాదెండ్లకు, పవన్ కల్యాణ్ కు మాత్రమే అర్థమవుతున్నాయేమో. జగన్ వ్యూహం చూసి తాళలేక.. ప్రజాస్వామ్యబద్ధం లాంటి పెద్ద పెద్ద మాటలు నాదెండ్ల వాడుతూ.. జనసేన పార్టీ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారని జనం నవ్వుకుంటున్నారు.