ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలో వైసీపీ అభ్యర్థి ఎంపికపై అసమ్మతి వర్గం హెచ్చరిక జారీ చేసింది. బద్వేలు ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం. ఇక్కడి నుంచి 2019లో డాక్టర్ వెంకటసుబ్బయ్య వైసీపీ తరపున గెలుపొందారు. అనారోగ్యంతో ఆయన మరణించడంతో వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ సుధ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆమే బద్వేలు ఎమ్మెల్యే.
అయితే రానున్న ఎన్నికల్లో మాల సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సుధను మార్చి మాదిగలకు టికెట్ ఇవ్వాలని వైసీపీ అసమ్మతి వర్గ నాయకుడు నల్లేరు విశ్వనాథరెడ్డి నేతృత్వంలో డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. కాశినాయన మండల వైసీపీ కన్వీనర్ అయిన విశ్వనాథరెడ్డికి నియోజకవర్గం వ్యాప్తంగా చెప్పుకోతగ్గ పలుకుబడి వుంది. ఈయన నేతృత్వంలో ఇవ్వాల పోరుమామిళ్ల మండలంలో నిర్వహించిన సమావేశానికి 24 మంది సర్పంచులు, 20 ఎంపీటీసీలు, కాశినాయన, అట్లూరు ఎంపీపీలు, ఇలా మొత్తం వెయ్యి మంది గ్రామ, మండల స్థాయి నాయకులు హాజరయ్యారు.
డాక్టర్ సుధను ఎమ్మెల్సీ, బద్వేలు వైసీపీ ఇన్‌చార్జ్ గోవిందురెడ్డి సమర్థిస్తున్నారు. డాక్టర్ సుధ ఎమ్మెల్సీ చెప్పినట్టు వింటూ, బద్వేలు నియోజకవర్గంలో మరే వైసీపీ నాయకుడిని పట్టించుకోలేదని సమావేశానికి హాజరైన నేతలు ఆరోపించడం గమనార్హం. సమావేశం అనంతరం విశ్వనాథరెడ్డి మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ సుధను మార్చి, మరో మంచి అభ్యర్థిని ఎంపిక చేయాలని మీడియా ద్వారా వైసీపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఒకవేళ తమ విజ్ఞప్తిని పార్టీ పరిగణలోకి తీసుకోకుంటే కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
ఇదిలా వుండగా అసమ్మతి వర్గం సమావేశం కావడం, అభ్యర్థి మార్పుపై హెచ్చరిక చేయడంతో బద్వేలు వైసీపీలో దుమారం చెలరేగింది. గెలుపోటములను ప్రభావితం చేయగల స్థాయిలో తామున్నామని విశ్వనాథరెడ్డి నేతృత్వంలోని అసమ్మతి వర్గం హెచ్చరించడం అధికార పార్టీలో గుబులు రేపుతోంది. ఇప్పటికైనా బద్వేలు వైసీపీలో అసమ్మతిని పట్టించుకోకపోతే రానున్న ఎన్నికల్లో నష్టపోవాల్సి వస్తుందని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.