కొట్టుకోవ‌డం తెలుసు…ప‌వ‌న్‌పై త‌గ్గేదే లే!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై త‌గ్గేదే లేద‌ని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి తేల్చి చెప్పారు. వారాహి యాత్ర ప్రారంభించిన ప‌వ‌న్‌కల్యాణ్ వ‌రుస‌గా రెండు స‌భ‌ల్లో కాకినాడ ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. త‌న పార్టీ వీర…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై త‌గ్గేదే లేద‌ని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి తేల్చి చెప్పారు. వారాహి యాత్ర ప్రారంభించిన ప‌వ‌న్‌కల్యాణ్ వ‌రుస‌గా రెండు స‌భ‌ల్లో కాకినాడ ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. త‌న పార్టీ వీర మ‌హిళ‌లు, నాయ‌కుల‌పై ద్వారంపూడి దాడి చేయించార‌ని, అది త‌న గుండెల్లో గుచ్చుకుంద‌ని, ఎప్ప‌టికీ మ‌రిచిపోలేన‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాకినాడ‌కు వెళ్లిన‌ప్పుడు అక్క‌డి ఎమ్మెల్యే అంతు తేలుస్తాన‌ని మ‌రీమ‌రీ హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే.

ఇవాళ కాకినాడ బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ ప్ర‌సంగించ‌నున్నారు. బ‌హిరంగ స‌భ‌కు కొన్ని గంట‌ల ముందు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి మీడియాతో మాట్లాడుతూ ప‌వ‌న్‌పై మండిప‌డ్డారు. అన్న‌య్యో, తండ్రి పేరో చెప్పుకుని తాను రాజ‌కీయాల్లోకి రాలేద‌ని ప‌వ‌న్‌ను ప‌రోక్షంగా దెప్పి పొడిచారు. మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకుని ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి ప్ర‌వేశించ‌డాన్ని ఆయ‌న ప‌రోక్షంగా గుర్తు చేశారు. గొడ‌వ‌ల ద‌గ్గ‌రి నుంచి కొట్టుకోవ‌డం వ‌ర‌కూ అన్నీ చూశాన‌ని, ప‌వ‌న్ హెచ్చ‌రిక‌ల‌కు త‌గ్గేదే లే అని ద్వారంపూడి త‌న‌దైన రీతిలో వార్నింగ్ ఇచ్చారు.

కాలేజీ రోజుల నుంచి రాజ‌కీయాల్లో పాల్గొంటూ, ఉగాది ప‌చ్చ‌డిలా అన్నీ ర‌కాల అనుభ‌వాల‌ను రుచి చూశాన‌ని, ఇవాళ రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యాన‌ని ప‌వ‌న్‌కు గుర్తు చేశారు. ఇవాళ యాత్ర‌లో భాగంగా త‌న గురించి ప‌వ‌న్ మాట్లాడ్తార‌ని ఆశిస్తున్న‌ట్టు ద్వారంపూడి చెప్పారు. రేపు మ‌ళ్లీ మీడియా స‌మావేశం పెట్టి అన్ని ర‌కాలుగా స‌మాధానం ఇస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. ప‌వ‌న్ ఆరోప‌ణ‌ల్లో నిజం వుంటే స్పందించ‌న‌ని, అబ‌ద్ధాలు చెబితే మాత్రం ఊరుకునే ప్ర‌శ్నే లేద‌న్నారు.

ఊరికే మాట అంటే తాను మౌనంగా వుండే వ్య‌క్తిని కాద‌ని ప‌వ‌న్‌కు వార్నింగ్ ఇచ్చారు. ప‌వ‌న్ స‌భ‌కు ముందు ద్వారంపూడి హెచ్చ‌రిక‌లు కాకినాడ‌ల‌తో పొలిటిక‌ల్ హీట్ పెంచాయి. ఇవాళ్టి స‌భ‌లో ద్వారంపూడిపై ప‌వ‌న్ విమ‌ర్శ‌లు, రేప‌టి కౌంట‌ర్ ఎలా వుంటుంద‌నే అంశం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.