కాపు ఉద్యమం అంటే మొదట వినిపించే పేరు ముద్రగడ పద్మనాభం. కాపుల సంక్షేమం కోసం తన రాజకీయ ప్రయోజనాలను కూడా బలిపెట్టిన నాయకుడు ముద్రగడ. జనసేనాని పవన్‌కల్యాణ్‌కు బహిరంగ లేఖ రాసి గట్టి షాక్ ఇచ్చారు. ఈ లేఖలో మొట్టమొదటి వాక్యాన్ని చదివితే, జనసేనానిపై ముద్రగడ అభిప్రాయాన్ని అర్థం చేసుకోవచ్చు. జనసేనకు ఇది ముమ్మాటికీ షాక్ ఇచ్చే అంశమే.
గౌరవనీయులు ప్రముఖ నటులు పవన్‌కల్యాణ్ గారికి అంటూ ముద్రగడ పద్మనాభం నమస్కారాలతో లేఖ రాశారు. పవన్‌కల్యాణ్‌ను ప్రముఖ నటుడిగా తప్ప, రాజకీయ నాయకుడిగా ముద్రగడ పద్మనాభం పరిగణించలేదని ఇట్టే అర్థమవు తోంది. పవన్‌కల్యాణ్‌కు కనీస రాజకీయ లక్షణాలు లేవని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం లేఖ మొదలు పెట్టడంలోనే పవన్‌ను ప్రముఖ సినీ నటుడిగా గుర్తించడం వెనుక ఉద్దేశంపై విస్తృతమైన చర్చ జరుగుతోంది.
లేఖలోని మిగిలిన అంశాల కంటే, అసలు పవన్‌ను జనసేనానిగా కాపు ఉద్యమ నేత గుర్తించకపోవడం ఆ పార్టీ శ్రేణుల్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. సాటి కుల నాయకుడిగా పవన్‌ను ముద్రగడ పద్మనాభమే గుర్తించకపోతే, ఇక మిగిలిన సామాజిక వర్గాలు హీనంగా చూడవా? అనే చర్చకు తెరలేచింది. రాజకీయ సలహాలు ఎవరిస్తున్నారో తనకు తెలియదని, కానీ మీరు మాట్లాడే భాష ఒక పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడాల్సింది కాదని ముద్రగడ హితవు పలకడం గమనార్హం.
ఈ భాష నష్టమే తప్ప, లాభం లేదని ఆయన హెచ్చరించడం విశేషం. పవన్‌కు వార్నింగ్ ఇచ్చే సందర్భంలో మాత్రమే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ముద్రగడ గుర్తించారు. అలాగే పొత్తుల్లో భాగంగా పోటీ చేస్తామంటూ, మీకు మీరే ముఖ్యమంత్రిగా ఊహించుకోవడం ఏంటని పవన్‌కు ముద్రగడ చీవాట్లు పెట్టారు.