ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను కుమ్మేసిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం

ఇటీవ‌ల కాకినాడ‌లో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డిపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఘాటైన బ‌హిరంగ లేఖ రాశారు. ఈ లేఖ‌లో ద్వారంపూడి కుటుంబం కాపు…

ఇటీవ‌ల కాకినాడ‌లో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డిపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఘాటైన బ‌హిరంగ లేఖ రాశారు. ఈ లేఖ‌లో ద్వారంపూడి కుటుంబం కాపు ఉద్య‌మానికి చేసిన సాయాన్ని ఆయ‌న మంచిగా ప్ర‌స్తావించారు. అలాగే ప‌వ‌న్‌క‌ల్యాణ్ భాష‌పై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే అనేక విష‌యాల‌ను ముద్ర‌గ‌డ ప్ర‌స్తావిస్తూ…ప‌వ‌న్‌ను కుమ్మేశారు. అందుకే లేఖ మొద‌ట్లోనే త‌న‌ను తుదిముట్టించాల‌న్న కోపం మీ అభిమానుల‌కు రావ‌చ్చ‌ని ప‌వ‌న్‌ను ఉద్దేశించి అన‌డం గ‌మ‌నార్హం. ప‌వ‌న్‌కు ముద్ర‌గ‌డ రాసిన బ‌హిరంగ లేఖ యధాత‌థంగా….

గౌర‌వ‌నీయులు ప్ర‌ముఖ న‌టులు ప‌వ‌న్‌క‌ల్యాణ్ గారికి …ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం న‌మ‌స్కారాలు.

ఈ లేఖ‌ మీకు రాసినందుకు ఎక్కడా లేని కోపం రావచ్చు. రాష్ట్రంలో ఉన్న మీ కోట్లాది మంది అభిమానులకు అయితే నన్ను తుది ముట్టించాలనే ప్రయత్నం చేయవచ్చు. అయినా నిజాన్ని నిర్భయంగా రాయాలనిపించి రాయక తప్పలేదండి.

నేను కులాన్ని అడ్డం పెట్టుకుని నాయకుడిగా ఎదిగినట్లు, యువతను వాడుకుని భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గుడుపుకుంటున్నానని, ఉద్యమాన్ని ప్రభుత్వాలు మారినప్పుడల్లా చేయలేదని సెలవిచ్చారు. గౌరవ చంద్రబాబునాయుడు గారు పోగొట్టుకున్న బి.సి రిజర్వేషన్ పునరుద్ధరిస్తాను అని పదే పదే చెప్పడం వల్ల రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి వారి ద్వారా మీరే కల్పించారు. ప్రతిపక్ష నాయకులు హోదాలో గౌరవ జగన్మోహనరెడ్డి గారు జగ్గంపేట సభలో రిజర్వేషను అంశం నా చేతిలో ఉండదు కేంద్రం పరిధి అని వారన్నప్పుడు నేను సమాధానం ఇచ్చిన పదాలు ఏంటో అడిగి తెలుసుకోండి. నా సమాధానం తరువాత కాపులకు 5వేల కోట్లు నుంచి 10 వేలు కోట్లు ఇస్తానంటే కృష్ణాజిల్లా గుడివాడ నుంచి 10వేల కోట్లు కాదండి మీ సామాజిక వర్గానికి 20వేలు కోట్లు ఇస్తాం. బి.సి ల నుండి పిల్లి బోసుగారినో, కాపుల నుండి బొత్స సత్యన్నారాయణ గారినో ముఖ్యమంత్రిని చేయమని అడిగిన వ్యక్తిని. నేను స్వార్ధపరుడను… కోట్లాది రూపాయలు సూట్కేసులకు అమ్ముడు పోవడానికి ఉద్యమం చేయలేదు, అమ్ముడు పోలేదు. నాకంటే చాలా చాలా బలవంతులైన మీరు నేను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి యువతకు రిజర్వేషన్ ఫలాలు ఎందుకు తీసుకురాలేదో చెప్పాలి.

కులాన్ని అడ్డంపెట్టుకుని ఎప్పుడూ ఏ పదవి పొందలేదు. కోట్లాది రూపాయలు ఇరువురు గౌరవ పెద్దలు వద్ద గాని ఎవ్వరిని బెదిరించి గాని మీ దగ్గర పొందలేదు. గమనించండి. మీకు తెలుసో తెలియదో గాని ఎప్పుడు ఓటమి ఎరగని నేను కాపు ఉద్యమంతో ఓటమికి దగ్గరయ్యాను. దీనిని బట్టి నేను కులాన్ని వాడుకున్నానో లేదో ఇప్పటికైనా తెలుకోండి.

ఎమ్.ఎల్.ఎ గారిని తిట్టడానికి మీ విలువైన సమయాన్ని వృథా చేయకండి. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మకం నుంచి కాపాడడం, ప్రత్యేక రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంటు వగైరా సమస్యలు ఉన్నాయండి. వాటి గురించి ప్రయత్నం చేయమని 2019 ఎన్నికల ముందు మీరు నా వద్దకు పంపించిన రాయబారులకు సలహా ఇచ్చి పంపించానండి. కాని ఆ సలహాలు అడిగి గాలికి వదిలేసారు. మీకు నిజంగా రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటే వీటిపై యుద్ధం చేయండి. కాని నాలాంటి అనాథ‌ల మీద కాదండి. విమర్శలు ఆపి పైన రాసిన వాటిపై కార్యాచరణ తయారు చేసుకుని రోడ్డు ఎక్కండి. పార్టీ పెట్టిన తరువాత పదిమంది చేత ప్రేమించబడాలి గాని వీధి రౌడి భాషలో మాట్లాడటం ఎంత వరకూ న్యాయమంటారు?  రాజకీయాలలో అతి సామాన్యుడు తాలూకు ఇంటికి వెళ్ళి ఓట్లు అడుక్కోవాలి. ఉద్యమాలలో అయితే ఎవరింటికి వెళ్లి సహాయం చేయమని అడగనవసరం లేదండి. మనం చేసే ఉద్యమం మంచి కోసం చేస్తే కులాలకు అతీతంగా బలపరిచేవారు చాలా మంది ఉంటారండి.

మీకు రాజకీయ సలహాలు ఎవరిస్తున్నారో నాకు తెలియదు గాని మీరు మాట్లాడే భాష ఒక పార్టీ అధినేతగా మాట్లాడవలసినది కాదండి. దీని వల్ల నష్టం తప్ప లాభం ఎంత మాత్రం ఉండదండి.

మీ ప్రసంగాలలో పదే పదే కొన్ని పదాలు తరచూ వస్తున్నాయండి. తొక్క తీస్తా, నార తీస్తా, కింద‌ కూర్చోబెడతా, చెప్పుతో కొడతా, గుండు గీయిస్తా అంటున్నారు కదండి. ఇప్పటి వరకూ ఎంతమందికి తీయించి, కింద కూర్చోబెట్టారో, గుండ్లు ఎంతమందికి చేయించారో, ఎంతమందిని చెప్పుతో కొట్టారో సెలవివ్వాలి.

మీ రాజకీయ యాత్ర ప్రారంభం నుంచి కాకినాడ శాసనసభ్యులు గౌరవనీయులు చంద్రశేఖరరెడ్డి గారిని, వారి తండ్రి భాస్కరరెడ్డి గారిని, వారి తాత కృష్ణారెడ్డి గారిని… వారిది తప్పుడు మార్గాలలో సంపాదన  అనే మాట చాలా తప్పు క‌ళ్యాణ్ గారు. ఎమ్.ఎల్.ఎ గారి కుటుంబంతో ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉందండి. మా ఇంట్లో శుభకార్యాలకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళని కృష్ణారెడ్డి గారు వచ్చి దీవెనలు ఇచ్చేవారండి. 1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు గారు మంత్రి పదవి ఇస్తే నేను తీసుకోకపోతే కృష్ణారెడ్డి గారు, భాస్కరరెడ్డి గారు ఉదయం 6 గంటలకు కిర్లంపూడి వచ్చి 2 గంటలు ఉండి ఎన్నో నా కుటుంబ విషయాలు చెప్పి మంత్రి పదవి తీసుకుని పదిమందికి సహాయపడమని సలహా ఇచ్చిన గౌరవమైన కుటుంబమండి.

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా లారీలు, కార్లు, సప్లై యిచ్చేవారండి. 1988 సం॥లో విజయవాడ కాపునాడు సభకి సుమారు 100 లారీలు, సహాయంగా పొందాను. 1993-94 కాపు ఉద్యమం టైములో కోట్ల విజయభాస్కరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కూడా ఉద్యమం సంబంధించిన పోస్టర్లు వేయించుకోవడానికి 50 రూపాయలు లేని సమయంలో 50వేల రూపాయలతో పోస్టర్లు వేయించిన కుటుంబమండి. కాపుల సభలు, ఉద్యమాలు ఎన్ని జరుపుకున్న వారి నుంచి వాహనాలు సహాయంగా పొందేవాడిని. కాపులు ఉద్యమాలకు సహాయం చేసిన వారిని విమర్శించడం తగదు అని తమరికి మనవి చేసుకుంటున్నాను. కాపులు తరపున చేసిన ఉద్యమాలకు మీరెందుకు రాలేదని నేనేమి ప్రశ్నించదలచుకోలేదండి. కాని తరచూ మీ ఉపన్యాసాలలో కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని అనడం విడ్డూరంగా ఉందండి.

రాజకీయాలలో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరండి. కాకినాడ ఎమ్.ఎల్.ఎ గారు దొంగ అయినప్పుడు రెండు దఫాలు ఎమ్.ఎల్.ఎ గా ఎందుకు గెలుపొందారో ఆలోచించరాండి? మీరు అన్నట్లు ఈ దుర్మార్గపు శాసనసభ్యులను అసెంబ్లీకి పంపించకుండా ఉండడం కోసం రేపు జరగబోయే ఎన్నికలలో వారి మీద పోటీ చేసి చిత్తుగా ఓడించండి. సత్తా చూపడానికి ముందుకు రండి. వారిని, శాశ్వతంగా రాజకీయాల నుంచి తొలిగేలా చేయండి.

మరొక విషయం బి.జె.పి, టి.డి.పి, మీరు కలసి పోటీ చేస్తామని తరచూ అంటున్నారు. అటువంటప్పుడు నా జనసేన పార్టీకి మద్దతు ఇవ్వండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని ఎలా అడుగుతున్నారో నాకు అర్ధంకాని ప్రశ్నండి. 175 స్థానాలకు పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రిని చేయండి అనే పదం వాడాలి తప్ప‌, కలసి పోటీ చేసేటప్పుడు మీకు మీరే ముఖ్యమంత్రి అనుకోవడం హాస్యాస్పదంగా ఉందండి.

…ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం