కర్నాటక మాజీ మంత్రి జనార్ధన్‌రెడ్డికి సర్వోన్నత న్యాయస్థానం గాలి తీసింది. బెయిల్ నిబంధనలను సడలించాలనే ఆయన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. దీంతో కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
గనుల అక్రమ తవ్వకాలకు గాలి జనార్ధన్‌రెడ్డి కేరాఫ్ అడ్రస్‌గా మారారు. అక్రమ తవ్వకాలకు సంబంధించి సీబీఐ కేసు నమోదు, విచారణ సంగతుల గురించి అందరికీ తెలిసినవే.
ఈ నేపథ్యంలో ఈ కేసులో తన బెయిల్ నిబంధనలను సడలించాలని కోరుతూ గాలి జనార్ధన్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణకుమారి ధర్మాసనం విచారించింది. గాలి జనార్ధన్‌రెడ్డి అభ్యర్థనను తిరస్కరించడమే కాకుండా, వెంటనే ట్రయిల్‌ను మొదలు పెట్టాలని హైదరాబాద్ సీబీఐ కోర్టును సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
రోజువారీ విచారణ చేపట్టి, ఆరు నెలల్లో పూర్తి చేయాలని హైదరాబాద్ సీబీఐ కోర్టును ధర్మాసనం ఆదేశించడం గమనార్హం. గాలి జనార్ధన్‌రెడ్డి కేసు విచారణ జాప్యం కావడంపై ఇటీవల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసును త్వరగా తేల్చాలని ఆదేశించడం చర్చనీయాంశమైంది. గాలి జనార్ధన్‌రెడ్డి గనుల అక్రమ తవ్వకాలపై సీబీఐ కోర్టు ఏం తేలుస్తుందో అనే అంశం తెరపైకి వచ్చింది.