వ్యూహం, ఎత్తుగ‌డ‌, మైండ్‌గేమ్‌…వారెవ్వా ఏం క‌ల‌రింగ్‌!

టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తు వ్య‌వ‌హారం బెడిసి కొట్టిన‌ట్టు వార్త‌లొస్తున్నాయి. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇటీవ‌ల చేస్తున్న కామెంట్స్ కూడా ఈ ప్ర‌చారానికి బ‌లం చేకూరుస్తున్నాయి. దీంతో టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా బెంబేలెత్తిపోతోంది.…

టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తు వ్య‌వ‌హారం బెడిసి కొట్టిన‌ట్టు వార్త‌లొస్తున్నాయి. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇటీవ‌ల చేస్తున్న కామెంట్స్ కూడా ఈ ప్ర‌చారానికి బ‌లం చేకూరుస్తున్నాయి. దీంతో టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా బెంబేలెత్తిపోతోంది. ఇంత‌కాలం టీడీపీ ప‌ల్ల‌కీని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మోస్తార‌ని, అధికారం ఖాయ‌మ‌నే రీతిలో విస్తృతంగా ప్ర‌చారం చేశారు. అయితే వారాహి యాత్ర‌లో ప‌వ‌న్ ప్ర‌సంగాల్లో పొత్తు అనే మాటే లేదు.

జ‌న‌సేన‌కు అధికారం ఇవ్వాల‌ని, తానే ముఖ్య‌మంత్రి అవుతాన‌ని ప‌దేప‌దే చెప్పుకొచ్చారు. అది కూడా త‌న‌ను న‌మ్మ‌ర‌నే ఉద్దేశంతో దేవుళ్ల‌పై ప్ర‌మాణం చేసి మ‌రీ చెప్పారాయ‌న‌. ప‌వ‌న్‌క‌ల్యాణ్ సొంత ఎజెండాతో ముందుకెళుతున్నార‌ని గ్ర‌హించిన ఎల్లో మీడియా క‌నీసం ఆయ‌న బ‌హిరంగ స‌భ‌ల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో చూప‌ని ప‌రిస్థితి. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను తిడుతుంటే ఆనందంగా లైవ్ ఇచ్చిన ఎల్లో మీడియా… తానే ముఖ్య‌మంత్రి అని ప‌వ‌న్ కొత్త నినాదం మొద‌లు పెట్ట‌డంతో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా డిబేట్ల‌ను స్టార్ట్ చేశాయి.

మ‌రోవైపు జ‌న‌సేన ఎదురు దాడికి దిగింది. దీంతో వ్య‌వ‌హారం చెడిపోతోంద‌ని గ్ర‌హించిన ఎల్లో మీడియాలోని కొంద‌రు ప్ర‌తినిధులు, అలాగే అనుకూల సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌లు… అబ్బే టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తు లేద‌నే మాట అవాస్త‌వ మంటూ చెప్ప‌డం మొద‌లు పెట్టారు.

ఇదంతా చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆడుతున్న మైండ్ గేమ్‌, వ్యూహం, ఎత్తుగ‌డ అని ఏవేవో పేర్లు పెట్టి డ్యామేజీని త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం మొద‌లు పెట్టారు. ఇటీవ‌ల మ‌చిలీప‌ట్నంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎట్టి ప‌రిస్థితుల్లో టీడీపీతో పొత్తు వుంటుంద‌ని బ‌హిరంగంగా చెప్ప‌డం వ‌ల్ల టీడీపీ, జ‌న‌సేన‌ల‌కు న‌ష్టం వాటిల్లుతోంద‌ని గ్ర‌హించి  ఇరుపార్టీల అధినేతలు వ్యూహం మార్చారంటూ క‌ల‌రింగ్ ఇస్తున్నారు.

ఇప్ప‌టికే ఇరుపార్టీల మ‌ధ్య పొత్తు కుదిరింద‌ని, సీట్ల పంపిణీ కూడా జ‌రిగింద‌ని, ఎక్క‌డెక్క‌డ ఎవ‌రెవ‌రు పోటీ చేయాల‌నే విష‌యాల‌పై కూడా చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చారంటూ ప్ర‌చారం చేయ‌డం గ‌మ‌నార్హం. జ‌న‌సేన‌, టీడీపీ మ‌ధ్య పొత్తు కుద‌ర‌క‌పోతే వైసీపీ సునాయాసంగా అధికారంలోకి వ‌స్తుంద‌నే సంకేతాల్ని ప్ర‌తిప‌క్ష నేత‌లే తీసుకొచ్చారు. 

ఇప్పుడేమో ప‌వ‌న్‌కు గౌర‌వ‌ప్ర‌ద‌మైన సీట్లు ఇచ్చేందుకు చంద్ర‌బాబు స‌సేమిరా అంటున్న‌ట్టు జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో జ‌న‌సేన అండ‌లేక‌పోతే టీడీపీ అధికారంలోకి రాలేద‌నే భ‌యం చంద్ర‌బాబు, ఇత‌ర నేత‌ల్లో వుంది. అయితే ఎన్నిక‌ల వ‌ర‌కూ పొత్తు వుంటుంద‌ని ప్ర‌చారం చేసుకుని రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకోవ‌డం చంద్ర‌బాబుకు చాలా అవ‌స‌రం. అందుకే జ‌న‌సేనానికి ప్ర‌చారం త‌గ్గిస్తూ, ఆ పార్టీతో పొత్తు మాత్రం వుంటుంద‌ని విస్తృతంగా జ‌నంలోకి తీసుకెళ్లేందుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తంటాలు ప‌డుతోంది.