టీడీపీలో టికెట్ల ప్రకటన కాక రేపుతోంది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో రాత్రికి రాత్రే టీడీపీ అభ్యర్థిగా జీ.ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని అధిష్టానం ప్రకటించిందని, సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలనే పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ పోస్టర్లపై ప్రవీణ్ పెద్ద ఫొటో ఉండడం గమనార్హం.
ఈ వ్యవహారం ప్రొద్దుటూరు టీడీపీలో రచ్చకు దారి తీసింది. ప్రొద్దుటూరు టీడీపీలో నాలుగైదు గ్రూపులున్నాయి. టీడీపీ ఇన్‌చార్జ్ ప్రవీణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, మల్లెల లింగారెడ్డి, అలాగే సీఎం సురేష్‌నాయుడు తదితరులు ఎవరికి వారు టికెట్ తమకంటే తమకని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఇన్‌చార్జ్‌గా ఉన్న ప్రవీణ్ ఒక అడుగు ముందుకేసి ఏకంగా తనే అభ్యర్థిగా పెద్దపెద్ద పోస్టర్లను పట్టణమంతా గోడలకు అంటించారు.
ఇదే మిగిలిన టీడీపీ నేతల ఆగ్రహానికి కారణమైంది. మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి మీడియా ముందుకొచ్చి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 37 ఏళ్లుగా తాను టీడీపీలో ఉన్నానని, మూడేళ్ల క్రితం ప్రవీణ్ పార్టీలోకి వచ్చారని చెప్పుకొచ్చారు. టికెట్ ఎవరికనే విషయాన్ని చంద్రబాబునాయుడు, లోకేశ్ లేదా అచ్చెన్నాయుడు ప్రకటిస్తారన్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తన తమ్ముడి కుమారుడు ప్రవీణ్‌కు అధిష్టానం టికెట్ ప్రకటించిందని చెప్పడం ఏంటని ఆయన నిలదీశారు. ఇలా తనకు తానుగా ప్రచారం చేసుకోవడం మంచిది కాదని ఆయన మండిపడ్డారు.
మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అనుచరుడు, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మీడియాతో మాట్లాడుతూ ఇలా తనకు తానుగా టికెట్‌ను ప్రకటించుకోవడం సబబు కాదన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్‌కల్యాణ్ చెరో రెండు నియోజకవర్గాల్లో తామే పోటీ చేస్తామని ప్రకటించడం ఎలా వివాదాస్పదమైందో ఆయన గుర్తు చేశారు. సీఎం సురేష్‌నాయుడు అనుచరుడైన మున్సిపల్ మాజీ చైర్మన్ ముక్తియార్ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో నాయకులు ఎవరికి వారు ఇలా టికెట్లను ప్రకటించుకోవడం పద్ధతి కాదన్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీ ఇన్‌చార్జ్ ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ… తనకు, ఆ వాల్‌పోస్టర్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాత్రి తాను ఇంట్లోనే ఉన్నానని, బయట ఎవరేం చేశారో తెలియదని చెప్పడం గమనార్హం. ప్రవీణ్ నటనలో బాగా తర్ఫీదు పొందారని ఆయన పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ప్రవీణ్ వైఖరి సొంత పార్టీ నేతలకు కోపం తెప్పించేలా వుందని, పద్ధతి మానుకుంటే మంచిదని వారు హితవు చెప్పడం చర్చనీయాంశమైంది.