అన్న అన్నే, రాజకీయం రాజకీయమే అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన మాటలతో సంకేతాలు పంపారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబుతో పాటు తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం గమనార్హం.
తన అన్న ప్రభుత్వంపై షర్మిల ఏం మాట్లాడ్తారో అనే ఉత్కంఠకు ఆమె తెరదించారు. కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు స్వీకరించిన అనంతరం షర్మిల ప్రసంగిస్తూ తన సోదరుడు జగన్‌పై నేరుగానే ఎటాక్ చేశారు. ముఖ్యంగా మణిపూర్‌లో వందలాది మంది క్రైస్తవులను చంపినా, 60 వేల మంది నిరాశ్రయులైనా …ఒక క్రైస్తవుడై ఉండి కూడా జగన్ ఎందుకు నోరు మెదపలేదని షర్మిల నిలదీశారు. ఈ సందర్భంగా అసలు మీరు మనుషులేనా? అని ఆమె ప్రశ్నించడం చర్చనీయాంశమైంది.
రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆమె ఆరోపించారు. జగనన్నకు బదులు జగన్‌రెడ్డి అని షర్మిల సంబోధించడం గమనార్హం. బీజేపీకి జగన్ తొత్తుగా మారారని విరుచుకుపడ్డారు. చంద్రబాబుతో పాటు జగన్‌రెడ్డి తమ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టారని తీవ్రస్థాయిలో విమర్శించారు.
పోలవరానికి నిధులు ఇవ్వకపోయినా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అలాగే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకపోయినా ఒక్కరోజైనా ప్రశ్నించిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. వైఎస్సార్ అభిమానులంతా తన వెంట నడవాలని ఆమె పిలుపునివ్వడం విశేషం. బీజేపీని తన తండ్రి వైఎస్సార్ వ్యతిరేకించే వాళ్లని ఆమె గుర్తు చేశారు. కానీ ఆయన వారసుడిగా జగన్ బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆమె పరోక్షంగా విమర్శించారు.
కానీ బీజేపీని వ్యతిరేకించే నాయకురాలిగా తనను గుర్తించాలని, ఆదరించాలని ఆమె కోరారు. ఇలా వైఎస్సార్‌కు తాను ఎలా వారసురాలినో ఆమె ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయడం విశేషం.