తిరుపతిలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. తిరుపతి అసెంబ్లీ సీటు పొత్తులో భాగంగా జనసేనకు దక్కింది. జనసేనలో చేరిన చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అలియాస్ జంగాలపల్లి శ్రీనివాసులుకు టికెట్‌ను పవన్‌కల్యాణ్ ఖరారు చేశారు. దీంతో టికెట్‌ను ఆశిస్తున్న టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, వూకా విజయ్‌కుమార్, అలాగే జనసేన నాయకులు పసుపులేటి హరిప్రసాద్, ఆ పార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జ్ అయిన రాయల్ కాని రాయల్ ఖంగుతిన్నారు.
దీంతో లోకల్ -నాన్ లోకల్ అనే అంశాన్ని టికెట్ ఆశావహులంతా తెరపైకి తెచ్చి, జంగాలపల్లి అభ్యర్థిత్వానికి చెక్ పెట్టేందుకు ప్రయత్నించారు. ఇరుపార్టీల అధిష్టానం పెద్దలు సీరియస్ కావడంతో భయపడి ప్రత్యక్ష ఆందోళనలకు స్వస్తి పలికారు. పసుపులేటి హరిప్రసాద్ మాత్రం జంగాలపల్లి శ్రీనివాసులు వెంట నడుస్తూ, తిరుపతి నగరంలో ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.
మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తాను చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నానని అనుకుంటూ, టీడీపీ అధిష్టానం ఆగ్రహానికి గురి అవుతున్నారు. జనసేన, టీడీపీ నాయకుల్లో స్థానికులకు టికెట్ ఎవరికి ఇచ్చినా గెలిపించుకుంటామని ఆమె అంటున్నారు. స్థానికేతరులకు మద్దతు ఇవ్వమని తేల్చి చెప్పడం గమనార్హం. ఒకవేళ తనకు టికెట్ ఇస్తామంటే జనసేనలో చేరడానికి కూడా సిద్ధమే అని ఆమె ప్రకటించారు.
ఒకవైపు జనసేన అభ్యర్థి శ్రీనివాసులు తిరుపతిలో ప్రచారం చేసుకుంటుంటే, సుగుణమ్మ మాత్రం దింపుడుకళ్లెం ఆశతో వుండడం విమర్శలకు దారి తీసింది. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలోని సత్యవేడు టీడీపీ నాయకుడు జడ్డా రాజశేఖర్ అనే దళితుడిని స్ఫూర్తిగా తీసుకుని స్వతంత్ర అభ్యర్థిగా నిలవాలని కొందరు ఆమెకు సూచిస్తున్నారు. సత్యవేడు టికెట్‌ను వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి చంద్రబాబు ప్రకటించారు.
దీంతో జడ్డా రాజశేఖర్ తీవ్ర మనస్తాపం చెందారు. గత ఎన్నికల్లో ఆదిమూలంపై రాజశేఖర్ ఓడిపోయారు. ఈ దఫా గెలుస్తామనే ధీమాలో ఉన్న రాజశేఖర్ ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లారు. దీంతో రాజశేఖర్, ఆయన కుటుంబ సభ్యులంతా రోడ్డు మీదికి వచ్చారు. ఇండిపెండెంట్‌గా బరిలో నిలుస్తున్నానని, ఒక్క చాన్స్ ఇవ్వాలంటూ ఆయన సత్యవేడులో గడపగడప తిరుగుతున్నారు.
తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు కూటమి అభ్యర్థి స్థానికుడని, మరే ఇతర కారణాల వల్లో నచ్చకపోతే, ఆమే ఇండిపెండెంట్‌గా బరిలో దిగొచ్చు కదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎమ్మెల్యే టికెట్ కోసం కనీస విలువలు కూడా లేకుండా పార్టీ మారుతానని చెప్పడం ఏంటని జనసేన కార్యకర్తలు నిలదీస్తున్నారు. కనీసం తనతో చంద్రబాబు మాట్లాడ్డానికి కూడా ఇష్టపడడం లేదని తెలిసినా, ఇంకా టీడీపీని గబ్బిళంలా పట్టుకుని వేలాడడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
నిజంగా ప్రజల్లో తనకు బలం వుందని సుగుణమ్మ నమ్ముతుంటే, సత్యవేడు టీడీపీ నాయకుడు రాజశేఖర్ మాదిరిగా ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారనే ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది.