చంద్రబాబునాయుడు ఒక జాబితా అభ్యర్థులను ప్రకటించేశారు. అటు జనసేన కార్యకర్తల నుంచి, తెలుగుదేశంలోనే అసంతృప్తుల నుంచి విభేదాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. లోలోన రగులుతున్న అసంతృప్తులు అనేకం ఉండగా.. బయటపడుతున్నవి కొన్ని పార్టీ పరువును రచ్చకీడుస్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో ఫ్యాక్షన్ సంస్కృతికి ఆలవాలమైన ప్రాంతం నుంచి ఒక అసంతృప్త నాయకుడికి అనుచరులైన కొందరు కార్యకర్తలు పెట్రోలు క్యాన్లతో చంద్రబాబు నివాసానికి రావడం సంచలనం అవుతోంది. అక్కడ దాడులు విధ్వంసం చేయడానికి వచ్చారా? లేదా, ఆత్మాహుతి బెదిరింపులకోసం తెచ్చుకున్నారా? అనేది స్పష్టత రాలేదు.
చంద్రబాబునాయుడు ప్రకటించిన జాబితాలో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గానికి జయచంద్రారెడ్డి పేరును ప్రకటించారు. ఇదే నియోజకవర్గం నుంచి పార్టీ మాజీ ఇన్చార్జి శంకర్ యాదవ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఆయన మద్దతు దారులు చంద్రబాబును కలిసేందుకు పెద్దసంఖ్యలో ఉండవిల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన ఇంటికి వెళ్లే దారికి అడ్డంగా బైఠాయించి నిరసన తెలియజేశారు. శంకర్ యాదవ్ కే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాగా చంద్రబాబు గానీ, నారా లోకేష్ గానీ.. కనీసం వారిలో కొందరినైనా కలిసి సర్ది చెప్పేందుకు.. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని చెప్పడానికి కూడా సుముఖత వ్యక్తం చేయకపోవడం, ముందుకు రాకపోవడం గమనార్హం.
చంద్రబాబు నివాసంలోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ ఆందోళన కారులనుంచి రెండు పెట్రోలు క్యాన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ పెట్రోలుతో ఏం చేయడానికి వారు తీసుకువచ్చారన్నది మాత్రం తెలియరాలేదు. ఆత్మాహుతి బెదిరింపులు వంటివి చేయాలనుకునే వారు సాధారణంగా కిరోసిన్ తెచ్చుకుంటారు. ఎంతో ప్రమాదకరమైన పెట్రోలు కేన్లతో రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. చివరకు కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ వంటి నాయకులు వారికి సర్ది చెప్పి పంపారు.
తంబళ్లపల్లె స్థాయిలో బయటపడకపోవచ్చు గానీ.. కార్యకర్తల మధ్య విభేదాలు తెలుగుదేశం పార్టీకి పెద్ద తలనొప్పిగానే పరిణమిస్తున్నాయి. అలాగే.. జనసేన నాయకులు ఆశలు పెట్టుకున్న అనేక నియోజకవర్గాల్లో సయోధ్యకు అవకాశమే కనిపించడం లేదు. అభ్యర్థిత్వాలను ప్రకటించిన తర్వాత.. అసంతృప్తులు ప్రతిచోటా, ప్రతి పార్టీలోనూ ఉంటాయి. అయితే వారికి సర్ది చెప్పడానికి పార్టీ అధినేత ప్రయత్నించకపోవడమే వారికి ఆగ్రహం తెప్పిస్తోంది.
మొన్నటిదాకా శంకర్ యాదవ్ కు ఆశపెట్టి, పార్టీ ఇన్చార్జిగా వాడుకుని.. ఆయనతో భారీగా డబ్బు ఖర్చు పెట్టించిన తర్వాత ఇప్పుడు మొహం చాటేస్తున్నారని స్థానికంగా విమర్శలు వస్తున్నాయి.