చంద్రబాబునాయుడిని టీడీపీ నేతలు బండ బూతులు తిడుతున్నారు. ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నాయని చెబుతూనే, టికెట్లపై ఇంత వరకూ స్పష్టత ఇవ్వకపోవడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికలకు ఇక రెండు నెలల సమయం మాత్రమే వుందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గుర్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాంటప్పుడు ముందుగానే అభ్యర్థిత్వాలపై ఏదో ఒకటి తేల్చాలని చంద్రబాబు ఎందుకు అనుకోవడం లేదనేది వారి ప్రశ్న.
ఆలస్యం అమృతం విషం అని పెద్దలు ఊరికే చెప్పలేదని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఆలస్యమైతే అమృతం కూడా విషం అవుతుందని, అభ్యర్థుల ఎంపికలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని, రానున్న రోజుల్లో ఇది మరింత ఆలస్యమైతే రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అనవసరంగా జనసేనతోనూ, తాజాగా బీజేపీతో పొత్తు చర్చలంటూ కాలయాపన చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు.
మరోవైపు తమ ప్రత్యర్థులు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారని, తాము ప్రేక్షకపాత్ర పోషించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే ప్రజాదరణ ఎలా పొందుతామని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నామినేషన్ల చివరి రోజు వరకూ టికెట్లపై తేల్చకపోతే, పార్టీలో చోటు చేసుకునే అసమ్మతిని ఎలా సర్దుబాటు చేసుకోవాలని వారు నిలదీస్తున్నారు.
కాలానికి తగ్గట్టు మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా చంద్రబాబు అప్‌డేట్ కాలేదని, అందుకే పార్టీ రోజురోజుకూ దిగజారుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు ముగిసే నాటికైనా టికెట్లు ప్రకటిస్తారా? లేదా? అనే అనుమానం కలుగుతోందని కొందరు టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే టీడీపీ బతుకు తెల్లారినట్టే అని నిష్టూరమాడుతున్నారు.