పొత్తులు, సీట్లు, అభ్యర్థుల ప్రకటనకు, ఇంకా చాలా సమయం వుందని స్వయంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడే చెప్పారు. కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సేద తీరొచ్చు. మనశ్శాంతిగా నిద్రపోవచ్చు. ఈ లోపు ఢిల్లీలో బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య పొత్తులు, సీట్లు, అభ్యర్థుల ప్రకటనపై స్పష్టత వస్తుంది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో వైసీపీతో యుద్ధం చేయడానికి వెళ్లొచ్చు.
తన పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ… చావు కబురు చల్లగా చెప్పడం గమనార్హం. జనసేన, బీజేపీతో పొత్తులుంటాయని ఆయన తేల్చి చెప్పారు. కాబట్టి టికెట్ ఆశావహులు త్యాగాలకు సిద్ధపడాలని ఆయన కోరారు. బీజేపీ, జనసేన పార్టీలకు ఎన్నెన్ని సీట్లు ఇవ్వాలనే అంశం తేలడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఆ తర్వాతే అభ్యర్థుల ప్రకటన వుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు ఎన్నికలకు 50 రోజుల సమయం మాత్రమే వుందని చంద్రబాబే చెప్పారు.
ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం వుందని అనుకుందాం. చంద్రబాబు చెప్పిన ప్రకారం పొత్తులు, సీట్ల విషయం తేలే సరికి ఈ నెలాఖరు అవుతుంది. ఆ తర్వాత అభ్యర్థుల ప్రకటనకు మరో రెండు వారాల గడువు తప్పనిసరి. అప్పటికి ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుంది. నామినేషన్ల ప్రక్రియ మొదలై వుంటుంది. ఒకవైపు అధికార పార్టీ నేతలు కోలాహలంగా నామినేషన్లు వేస్తుంటే, మరోవైపు ప్రతిపక్షాలు అసంతృప్తులతో కొట్టుకు చస్తుంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏ రకంగా చూసినా టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు, సీట్లు, అభ్యర్థుల ప్రకటన సజావుగా సాగే పరిస్థితి ఉండదు. వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తూ, అభ్యర్థుల ప్రకటనకు తర్జనభర్జన పడుతోంది. ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటిస్తే, చిన్నచిన్న అసంతృప్తులు ఎన్నికల నాటికి సమసిపోతుందనే ఆలోచనతో సీఎం జగన్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. అలాంటి పరిస్థితి ఈ మూడు పార్టీల్లో కనిపించడం లేదు.
పొత్తులు ఫైనల్ చేసుకోడానికే పుణ్యకాలం కాస్త కరిగిపోతోంది. ఇక సీట్లు, అభ్యర్థుల ప్రకటన అంటే… ఎన్నికలు కూడా ముగుస్తాయేమో అని నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు. 2009లో మాదిరిగా పొత్తులు టీడీపీని ముంచేలా ఉన్నాయని ఆ పార్టీలో ఆందోళన మాత్రం నెలకుంది.