జనసేనాని పవన్‌కల్యాణ్‌తో సమస్యల్లా ఒక్కటే… ఆయన మహనీయుల ఆదర్శాల్ని, సూక్తుల్ని జనానికి చెబుతారు. తాను మాత్రం ఆచరించరు. లక్ష పుస్తకాలు కాకపోయినా, ఎంతోకొంత పుస్తకాలు చదివే సుగుణం ఆయనలో వుంది. శ్రీశ్రీ, గద్దర్, గుంటూరు శేషేంద్ర శర్మ, కె.శివారెడ్డి, అజంతా తదితరుల కవిత్వాన్ని, అలాగే కేశవరెడ్డి, చలం లాంటి గొప్పవాళ్ల వచన సాహిత్యాన్ని చదివారు. ఆ రచనల్లోని భావోద్వేగం పవన్‌కల్యాణ్‌లో కూడా కనిపిస్తుంటుంది.
తాజాగా ఆయన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా అక్షర నీరాజనాలు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి కారణజన్ముడైన పొట్టి శ్రీరాముల్ని స్మరించుకున్న పవన్ సంస్కారాన్ని తప్పక అభినందించాలి. పొట్టి శ్రీరాముల వర్ధంతికి ఆయన నివాళులర్పించిన తీరు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్‌ను అగ్రభాగాన నిలిపినప్పుడే ఆ మహనీయుడికి నిజమైన నివాళి అని ఆయన అభిప్రాయపడ్డారు.
‘ఆంధ్రప్రదేశ్ అవతరణకు కారకుడైన ఆ అమరజీవి వర్థంతి సందర్భంగా వ్యక్తిగతంగా, అలాగే జనసేన శ్రేణుల పక్షాన ముకుళిత హస్తాలతో నీరాజనాలు అర్పిస్తున్నా. సంకల్పం బలంగా ఉన్నప్పుడు… లక్ష్యం ప్రజా ప్రయోజనం అయినప్పుడు…నీ వెంట ఒక్కడూ లేకున్నా… ఒక్కడూ రాకున్నా విజయం సిద్ధించటం తథ్యమని అమరజీవి పొట్టి శ్రీరాములు నిరూపించారు. తెలుగు మాట్లాడేవారంతా తెలుగుతల్లి నీడలో ఒక రాష్ట్రంగా కలిసిమెలిసి జీవించాలని … తపించి తపించి తన ప్రాణాలను పణంగా పెట్టారు. త్యాగ నిరతితో ఏర్పడిన ఆంధ్రప్రదేను రక్షించుకునే అవకాశం విజ్ఞులైన ప్రజల చేతిలో ఉంది’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
సంకల్పం బలం, ప్రజాప్రయోజనంతో కూడిన లక్ష్యం ఉన్నప్పుడు వెంట ఒక్కరూ లేకున్నా, రాకున్నా విజయం సాధించొచ్చని పొట్టి శ్రీరాములు త్యాగ జీవితం నిరూపించిందని పవన్ గుర్తించడం విశేషం. మరి ఆయన జీవితం నుంచి పవన్ స్ఫూర్తిగా తీసుకుని ఏం సాధించారు? ఇప్పటికైనా పొట్టి శ్రీరాముల్ని ఆదర్శంగా తీసుకుని తన పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల్లో తలపడతారని ఆశిద్దాం. పొత్తుల కోసం ఎదురు చూడకుండా, తన చుట్టూ ఇతర పార్టీలు తిరిగేలా స్థాయికి పవన్ ఎదగాలని ఆశిద్దాం.