ఏపీలో ఇపుడు ఎన్టీయార్ వెన్నుపోటు మీదనే హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది. మరో వైపు ఉత్తరాంధ్రాకు రాజధాని కావాలన్న డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. ఈ నేపధ్యంలో రెండింటినీ మిక్స్ చేస్తూ నర్శీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ ఘాటైన కామెంట్స్ చేశారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీయార్ నర్శీపట్నం వస్తే అప్పటి మంత్రి అయ్యన్నపాత్రుడు చంద్రబాబుతో చేతులు కలిపి ఎన్టీయార్ మీద వెన్నుపోటుకు వ్యూహం రచించారని పెట్ల కొత్త పాయింట్ ని తెర మీదకు తెచ్చారు.
అలా నాటి నుంచి నేటి వరకూ వెన్నుపోట్లకు బాబుతో కలసి అయ్యన్న తోడు అవుతూనే ఉన్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్రాకు చంద్రబాబు అయ్యన్నపాత్రుడు చేసిందేమీ లేదని, ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడిచినట్లే ఈ ప్రాంతానికి కూడా అతి పెద్ద పోటు పొడిచేశారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి జగన్ వికేంద్రీకరణ పేరిట విశాఖను రాజధానిగా చేయాలని సంకల్పించారు. ఆ విధంగా ఉత్తరాంధ్రా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అంతా ఆశిస్తూంటే మళ్ళీ చంద్రబాబుతో కలసి అయ్యన్నపాత్రుడు అమరావతి పాట పాడుతున్నారని, తానున్న ప్రాంతానికి ద్రోహం చేస్తున్నారని పెట్ల ఫైర్ అయ్యారు.
అమరావతి రైతుల పాదయాత్రను నర్శీపట్నం సరిహద్దు గన్నవరం మెట్ట వద్ద అడ్డుకుంటామని అయ్యన్న వచ్చినా మరెవరు వచ్చినా ఆగేది లేదని పెట్ల హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాదయాత్ర చేస్తూ ఉత్తరాంధ్రా ప్రజల మనోభావాలతో ఆడుకుంటామంటే చూస్తూ ఎలా ఊరుకుంటామని ఆయన ప్రశ్నిస్తున్నారు.