కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయం వేడెక్కింది. పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్‌కల్యాణ్, వంగా గీత మధ్య డైలాగ్ వార్ చోటు చేసుకుంది. వంగా గీతకు తామే రాజకీయ భవిష్యత్ ఇచ్చామని, గతంలో పీఆర్పీ తరపున అరంగేట్రం చేశారని పవన్ అన్నారు. అలాగే దురదృష్టవశాత్తు వైసీపీలో ఆమె ఉన్నారని పవన్ విమర్శించారు. భవిష్యత్‌లో తమ పార్టీలో చేరుతుందనే ఆశాభావాన్ని పవన్ వ్యక్తం చేశారు.
పవన్‌కల్యాణ్ కామెంట్స్‌పై వంగా గీత సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. తామిద్దరం చేరో పార్టీ నుంచి పోటీ చేస్తున్నామన్నారు. అలాంటప్పుడు తన గురించి అలా మాట్లాడ్డం బాగాలేదని ఆమె అన్నారు. ప్రజల గుండెల్లో ఉన్న తమ జగనన్న పార్టీలో చేరాలని పవన్‌ను ఆహ్వానిస్తు ఎలా వుంటుందని ఆమె ప్రశ్నించారు. సీనియర్ రాజకీయ నాయకురాలిగా తాను కూడా ఆయన్ను ఆహ్వానించొచ్చని, కానీ అది సరైంది కాదన్నారు. తన రాజకీయ నేపథ్యం గురించి పవన్ తెలుసుకుని మాట్లాడితే మంచిదని ఆమె హితవు చెప్పారు.
2009కి ముందే తాను రాజకీయాల్లో ఉన్నట్టు వంగా గీత చెప్పుకొచ్చారు. డిగ్రీ చదువుకునే సమయం నుంచి రాజకీయాల్లో ఉన్నట్టు ఆమె తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా, రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నానని పవన్‌కు ఆమె గుర్తు చేశారు. ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు రాజకీయాలు, ప్రజల గురించే మాట్లాడాలని ఆమె సూచించారు. ఓటుకు లక్ష రూపాయలు ఇస్తామని పవన్ చెప్పడాన్ని ఆమె తప్పు పట్టారు. అసలు ఈ డబ్బు గొడవ ఏంటని ఆమె ప్రశ్నించారు. ఓటర్‌ను పవిత్రంగా చూడాలని ఆమె కోరారు.
ఓటరు మనస్తత్వం తెలుసుకోవాలన్నారు. ఎన్నికలంటే సీరియస్‌నెస్ వుండాలని ఆమె సూచించారు. జగన్ పార్టీ తరపున పోటీ చేస్తున్న తనదే విజయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. పవన్‌కల్యాణ్‌వి దింపుడు కళ్లెం ఆశలని ఆమె వెటకరించారు. లక్షలు ఖర్చు పెట్టడం వల్లే తాను గెలవలేదని సాకు చెప్పడానికే పవన్ డబ్బు ప్రస్తావన తెస్తున్నారని ఆమె విమర్శించారు.
పిఠాపురంలో కేవలం మెజార్టీ కోసమే ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రమాణం స్వీకారం ఒక్కటే మిగిలి వుందనే పవన్ కామెంట్స్‌ను వంగా గీత తనదైన రీతిలో తిప్పికొట్టారు. ఔను, తన మెజార్టీ కోసమే ఎన్నికలు జరుగుతున్నాయని వంగా గీత పంచ్ విసిరారు. జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, అలాగే తన సేవలే వైసీపీని గెలిపిస్తాయన్నారు. ఇబ్బంది లేకుండా జగన్ సంక్షేమ పథకాలు అందిస్తారనే నమ్మకం ఉందని, అలాగే ఏ క్షణంలో పిలిచినా అందుబాటులో వుంటానని అభ్యర్థిగా తనపై జనానికి నమ్మకం వుందని ఆమె అన్నారు. ఆ నమ్మకమే తనకు విజయాన్ని అందిస్తుందని మరోసారి ఆమె ధీమా వ్యక్తం చేశారు.