మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత బొండా ఉమామహేశ్వరరావుపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడ వెస్ట్ నుంచి ఆయన్ను సెంట్రల్‌కు మార్చి, సీఎం జగన్ కొత్త ప్రయోగం చేశారు. విజయవాడ సెంట్రల్‌లో ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు భారీగా ప్రలోభాలకు గురి చేస్తున్నట్టు బొండా ఉమా ఆరోపణలు చేశారు. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు.
తనను బొండా హెచ్చరించడంపై వెల్లంపల్లి సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. తనను భయపెట్టడం ఎవరి వల్లా కాదన్నారు. కండ్రిగలో వైసీపీ కార్యకర్తలను టచ్ చేసి చూడాలని ఆయన వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ రెండు నెలలో తన సంగతి చూస్తానని బొండా హెచ్చరించడాన్ని వెల్లంపల్లి తప్పు పట్టారు. ఎన్నికల్లోపే విజయవాడ సెంట్రల్ నుంచి తనను ఎత్తేస్తానని బొండా ఉమా అన్నారని ఆయన గుర్తు చేశారు.
బొండా ఉమా మాట్లాడే వాటిపై కేసులు ఉండవా? అని ఆయన ప్రశ్నించారు. ఒకరిని అన్నప్పుడు, అటు వైపు వాళ్లు అనేవి కూడా తీసుకోవాలని బొండా ఉమాకు హితవు చెప్పారు. దేనికైనా ధైర్యం వుండాలని వెల్లంపల్లి చెప్పారు. ప్రతి దానికి భయపడడం, కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఎన్నికల సంఘం అంటూ ఫిర్యాదులు చేయడం బొండా ఉమాకు పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ఫిర్యాదులో ఏదైనా విషయం వుంటుందా? అంటే… ఏమీ వుండదన్నారు.
ఊరికే భయపెడదామని బొండా ఉమా ఇలాంటివి చేస్తుంటారన్నారు. వెల్లంపల్లి శ్రీనును భయపెట్టడం అనేది.. నీ వల్ల కాదు కదా, నీ బాబు తరం కూడా కాదని ఘాటు హెచ్చరిక చేశారు. ఈ విషయాన్ని బొండా ఉమా గుర్తు పెట్టుకోవాలని ఒకటికి రెండుసార్లు ఆయన హెచ్చరించి చెప్పడం చర్చనీయాంశమైంది.