విశాఖ స్వరూపం మారుతోంది. అభివృద్ధి ఎక్కడా అని ప్రశ్నించే వారు విశాఖ మహా నగరం చూస్తే నోరు వెళ్ళబెడతారు. బీచ్ రోడ్ లో రాత్రి ప్రయాణం చేస్తే విద్యుద్దీపాలతో అద్భుతం కనిపిస్తుంది. అత్యాధునిక రీతిలో బస్సు స్టాండ్లను డిజైన్ చేశారు.
ఇపుడు నగరానికి నడిబొడ్డున ఉన్న జగదాంబ జంక్షన్ లో గంట స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో గంటస్తంభం అంటే విజయనగరంలో ఉన్నదే చెబుతారు. దానికి దీటుగా నిర్మాణానికి గీటు రాయిగా విశాఖలో గంటస్తంభం ఉండబోతోంది.
దీనికి సంబంధించిన పనులు చకచకా పూర్తి అవుతున్నాయి. మరి కొద్ది నెలలలో విశాఖలోనూ గంటస్తంభం కనిపించి చూడు విశాఖ అనిపించడం ఖాయం అంటున్నారు. విశాఖలోని ముఖ్య కూడళ్ళను కూడా అభివృద్ధి చేస్తున్నారు. విశాఖ తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పైన సైతం పలువురు ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు.
విశాఖ నుంచి పాలిస్తాను అని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్న నేపధ్యంలో రెండవసారి వైసీపీ అధికారంలోకి వస్తే విశాఖ రూపురేఖలు మారడం తధ్యమని అంటున్నారు. ఐకానిక్ టవర్ తో పాటు బ్రహ్మాండమైన క్రికెట్ స్టేడియం అలాగే ఐకానిక్ మోడల్ లో ప్రభుత్వ సెక్రటేరియట్ కూడా విశాఖలో నిర్మిస్తారు అని అంటున్నారు. సిటీ ఆఫ్ డెస్టినీ అని విశాఖకు పేరు. అలాంటి నగరం మీద ఫోకస్ పెడితే రానున్న కాలంలో విశాఖ ఒక సుందర నగరంగానే కాదు అద్భుత నగరంగా మారుతుంది అన్నది వైజాగ్ ప్రేమికుల మాట.