మరో అద్భుత చారిత్రిక ఘట్టాన్ని వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ అత్యంత ఉత్కంఠతతో ఎదురు చూస్తోంది. స్వాతంత్ర్యానంతరం ఆంధ్రప్రదేశ్‌లో అనేక మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. ఆ పరంపర స్వాతంత్ర్యానంతరం ఏడు దశాబ్దాల తర్వాత కూడా కొనసాగడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ చరిత్ర సమస్తం ఒడిదుడుకుల మయమే అని చెప్పాలి.
తమిళనాడు నుంచి భాషా ప్రాతిపదికన 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. పెద్ద మనుషుల ఒప్పందం “శ్రీబాగ్” ప్రకారం కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేశారు. అయితే ఇది ఎన్నో ఏళ్లు కొనసాగలేదు. అప్పుడప్పుడే అభివృద్ధి పథంలో బుడిబుడి అడుగులు వేస్తున్న ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణతో కలిపి 1956లో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. హైదరాబాద్‌ను రాజధాని కేంద్రంగా ఎంపిక చేశారు.
అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాము తీవ్ర అన్యాయానికి గురవుతున్నామనే ఆందోళన తెలంగాణ వాసుల్లో అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ప్రత్యేక తెలంగాణ కోసం మర్రి చెన్నారెడ్డి లాంటి ఉద్ధండులు వేర్పాటు ఉద్యమానికి నాయకత్వం వహించి అలుపెరగని పోరాటాలు చేశారు. అయితే నాటి ప్రధాని ఇందిరాగాంధీ ససేమిరా అనడంతో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష నెరవేరలేదు. అయితే తెలంగాణ వాసుల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష మాత్రం సజీవంగా నిలిచిపోయింది. 2000వ సంవత్సరం తర్వాత టీడీపీ నుంచి బయటికొచ్చిన కేసీఆర్ తెలంగాణ సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) స్థాపించారు.
దాదాపు దశాబ్ద కాలం పైబడి పోరాటం తర్వాత ఎట్టకేలకు యూపీఏ-2 ప్రభుత్వం తెలంగాణ ఆకాంక్షకు తలొగ్గింది. 2014లో ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తూ సోనియా నాయకత్వంలోని కేంద్ర సర్కార్ అడుగులు ముందుకేసింది. విభజనానంతరం తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా ఉండటంతో వెతుక్కోవాల్సిన పనిలేకపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అందుకు భిన్నమైంది.
చంద్రబాబు నాయకత్వంలోని ఏపీ సర్కార్ అమరావతిని రాజధానిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకొంది. ఇక్కడే అసలు సమస్య. నాటి కేంద్రప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సూచనలు, సిఫార్సులను చంద్రబాబు సర్కార్ బుట్టదాఖలు చేసింది. తన కేబినెట్ సభ్యుడైన మంత్రి నారాయణ నేతృత్వంలో కొందరు వ్యాపారస్తులతో నియమించుకున్న కమిటీ సిఫార్సు మేరకు రాజధాని ఏర్పాటుకు బాబు మొగ్గు చూపడం గమనార్హం.
ఆ తర్వాత ఐదేళ్లకు 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ నాయకత్వంలో వైసీపీ అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. జగన్ పాలన ఏడోనెలకు వచ్చేసరికి అభివృద్ధి వికేంద్రీకరణ నిమిత్తం మూడు రాజధానుల ఏర్పాటుకు మొగ్గు చూపారు. రాజధానిపై అధ్యయనానికి జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్, హైపవర్ కమిటీల సిఫార్సుల మేరకు జగన్ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకోవాలని జగన్ సర్కార్ గట్టిగా నిర్ణయించుకొంది.
ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర, సమ్మిళిత అభివృద్ధికి బాటలు వేసేందుకు వీలుగా పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మకమైన బిల్లును సోమవారం అసెంబ్లీలో ప్రతిపాదించనుంది. ఇందుకోసం జగన్ సర్కార్ మూడురోజుల పాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది.
అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రతిపాదిస్తూ వివిధ కమిటీలు, నిపుణుల సూచనల మేరకు అసెంబ్లీలో నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతి నుంచి పరిపాలనకు సంబంధించి సచివాలయం, హైకోర్టును వేర్వేరు ప్రాంతాలకు తరలించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు ఒకవైపు, అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా పెద్ద ఎత్తున ర్యాలీలు మరోవైపు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా నేడు ఓ చారిత్రక ఘట్టం ఆంధ్రప్రదేశ్‌లో ఆవిష్కృతం కానుంది. ఈ ఉజ్వల ఘట్టాన్ని వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ యావత్తు ఉత్కంఠతతో ఎదురు చూస్తోంది.