Advertisement

Advertisement


Home > Politics - Andhra

వైసీపీకి భారీ మెజార్టే ఆ పార్టీల ఆకాంక్ష‌!

వైసీపీకి భారీ మెజార్టే ఆ పార్టీల ఆకాంక్ష‌!

నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరులో ఉప ఎన్నిక పోలింగ్ మొద‌లైంది. మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి ఆక‌స్మిక మృతితో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. వైసీపీ త‌ర‌పున గౌత‌మ్‌రెడ్డి త‌మ్ముడు విక్ర‌మ్‌రెడ్డి, బీజేపీ త‌ర‌పున భ‌ర‌త్‌కుమార్ మ‌ధ్య ప్ర‌ధాన పోటీ. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీలు టీడీపీ, జ‌న‌సేన, కాంగ్రెస్ పోటీకి దూరంగా వున్నాయి. ల‌క్ష మెజార్టీ టార్గెట్ పెట్టుకుని వైసీపీ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డింది.

ఈ నెల 26న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి. ఇదిలా వుండ‌గా పోటీకి దూరంగా ఉన్న టీడీపీ, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల మ‌ద్ద‌తు ఎవ‌రికి? అనేది ప్ర‌శ్నార్థ‌క‌మైంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీజేపీకి మద్ద‌తు ఇవ్వ‌కూడ‌ద‌నే సంకేతాలు త‌మ పార్టీ పెద్ద‌ల నుంచి వ‌చ్చిన‌ట్టు టీడీపీ, జ‌న‌సేన గ్రామ నాయ‌కులు చెబుతున్నారు.

బీజేపీకి క‌నీసం డిపాజిట్ కూడా రాకూడ‌ద‌ని టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు కోరుకుంటున్నారు. వైసీపీకి భారీ మెజార్టీ వ‌చ్చినా ఇబ్బంది లేద‌నేది ఆ పార్టీ నాయ‌కుల వాద‌న‌. తాము బ‌రిలో లేక‌పోవ‌డం వ‌ల్లే వైసీపీకి భారీ మెజార్టీ వ‌చ్చింద‌ని చెప్పుకునే అవ‌కాశం ఉందంటున్నారు. 

ఒక‌వేళ బీజేపీకి చెప్పుకోత‌గ్గ ఓట్లు వ‌చ్చినా, భ‌విష్య‌త్‌లో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని వారు ఆందోళ‌న చెందుతున్నారు. అందుకే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీజేపీకి ఓట్లు వేయ‌వ‌ద్ద‌నేది టీడీపీ, జ‌న‌సేన నాయ‌కుల అంత‌రంగం. ఏపీలో బీజేపీ శూన్యం అని ఈ ఉప ఎన్నిక ద్వారా చాటి చెప్ప‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కులు అంటున్న మాట‌.

అందుకే ఈ ఉప ఎన్నిక‌లో బీజేపీకి జ‌న‌సేన క‌నీసం మ‌ర్యాద‌కైనా మ‌ద్ద‌తు ఇవ్వ‌ని విష‌యాన్ని రాజ‌కీయ వ‌ర్గాలు గుర్తు చేస్తున్నాయి. త‌మ‌తో జ‌త క‌డితే త‌ప్ప "మీకు అంత సీన్ లేదు" అని బీజేపీ నేత‌ల‌కు ఈ ఎన్నిక ద్వారా జ‌న‌సేన‌, టీడీపీ నేత‌లు చెప్ప‌ద‌లుచుకున్నారు. మ‌రి ఎన్నిక‌ల ఫ‌లితం వారు కోరుకున్న‌ట్టే ఉంటుందా? అనేది తెలియాలంటే మ‌రో రెండు రోజులు ఆగాల్సిందే. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?