Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఆ డైలాగ్ ను ఎంతమంది ఆపాదించుకుంటార్రా బాబూ!

ఆ డైలాగ్ ను ఎంతమంది ఆపాదించుకుంటార్రా బాబూ!

"ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా, చూసుకోవాలి. అందులోనూ ప్రజలు బాగుండాలి, వారికి మంచి జరగాలి అనుకునే వారికి మరీనూ." సర్కారువారి పాట సినిమాలో సూపర్ హిట్టయిన డైలాగ్ ఇది. మహేష్ నోటి నుంచి వచ్చిన ఈ డైలాగ్ ఇనిస్టెంట్ గా హిట్టయింది. అయితే ఇప్పుడీ డైలాగ్ ఫిలింసర్కిల్స్ వరకు మాత్రమే పరిమితం కాలేదు. ఏపీ రాజకీయాల్లోకి కూడా ఎంటరైపోయింది.

సర్కారువారి పాట సినిమాలోని ఈ హిట్ డైలాగ్ ను ముందుగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం ఎత్తుకుంది. చంద్రబాబు లాంటి నాయకుడికి ఎక్కడపడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారని, కాస్త చూసుకోవాలంటూ వైసీపీని రెచ్చగొడుతూ పోస్టర్ తయారు చేసి వదిలింది. ఇక ఆ తర్వాత మిగతా పార్టీలన్నీ రంగంలోకి దిగిపోయాయి.

ఆ వెంటనే జనసేన పార్టీ ఈ డైలాగ్ ఎత్తుకుంది. పవన్ కల్యాణ్ కు ఎక్కడపడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారని.. వైసీపీ నేతలు కాస్త చూసుకొని మాట్లాడాలని హెచ్చరిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇదే డైలాగ్ తో ఏపీ బీజేపీ కూడా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. మోదీకి దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారని చెప్పుకొచ్చింది.

తామెందుకు తగ్గాలని అనుకున్నారో ఏమో, వైసీపీ శ్రేణులు కూడా రంగంలోకి దిగిపోయాయి. ప్రజలు బాగుండాలి, వాళ్లకు మంచి జరగాలని కోరుకునే జగన్ లాంటి వాళ్లకు ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారని.. ఈ విషయంలో ప్రతిపక్షాలు కాస్త చూసుకొని ముందుకెళ్లాలని పోస్టర్ తయారుచేసి వదిలారు.

ఇలా పార్టీలన్నీ సర్కారువారి పాట సినిమా డైలాగ్ ను తమకు అనుకూలంగా మార్చుకుంటూ పోస్టర్లు తయారు చేసుకున్నాయి. వాటిని తమ గ్రూపుల్లో సర్కులేట్ చేసుకుంటున్నాయి. అయితే ఇదే సినిమాలో మహేష్ చెప్పిన "నేను విన్నాను, నేను ఉన్నాను" అనే డైలాగ్ ను మాత్రం ఏ పార్టీ ముట్టుకోలేకపోయింది. ఎందుకంటే, అది వైసీపీ బ్రాండ్ డైలాగ్. ఆ డైలాగ్ తో పోస్టర్లు వేయాలంటే వైసీపీ వాళ్లే వేయాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?