Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఆ మంత్రి గారు ప్రెస్ మీట్లు తగ్గించుకుంటే మంచిది..?

ఆ మంత్రి గారు ప్రెస్ మీట్లు తగ్గించుకుంటే మంచిది..?

ఇటీవల అంబటి రాంబాబుని సోషల్ మీడియాలో టీడీపీ ఎలా ఇబ్బంది పెడుతుందో చూస్తున్నాం. అంబటి నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉత్సాహంతో 2-3 ప్రెస్ మీట్లు పెట్టారు. పోలవరంపై మాట్లాడుతూ పాపమంతా చంద్రబాబు ఖాతాలో వేశారు. దీంతో టీడీపీ అనుకూల మీడియా రెచ్చిపోయింది. కావాలనే అంబటిని రెచ్చగొట్టి చివరకు ఆయన్ను ట్రోలింగ్ చేస్తోంది.

అంబటికి నీటిపారుదల రంగంపై పూర్తి పరిజ్ఞానం ఉంటుందని ఎవరూ అనుకోరు..? ఉండాలని కూడా రూలేమీ లేదు. అయితే ఆయన చేసిన తొందరపాటు పని ఏంటంటే.. వచ్చీ రావడంతోనే ప్రెస్ మీట్ పెట్టడం, పులిచింతల గోదావరిపై ఉంది అనడం, అన్ని ప్రాజెక్టుల్లో డయాఫ్రం వాల్ ఉంటుందని చెప్పడం. దీంతో అంబటి ప్రసంగాన్ని ముక్కలు ముక్కలుగా విరిచేసి.. సోషల్ మీడియాలో ఆటాడుకుంటోంది టీడీపీ బ్యాచ్.

కొత్తగా నిర్వహించిన ప్రెస్ మీట్లో అంబటిలో ఫ్రస్టేషన్ బాగా కనపడింది. జర్నలిస్ట్ లపై ఆయన విరుచుకుపడిపోయారు. రేపు పొద్దున ఫలానా హెడ్ లైన్ పెట్టుకో బాబూ అంటూ తస్మదీయ జర్నలిస్ట్ బ్యాచ్ కి వెటకారంగా సూచించారు. అయితే దీన్ని కూడా టీడీపీ అనుకూల మీడియా వదిలి పెట్టలేదు. సబ్జెక్ట్ లేకపోవడంతో అంబటి ఎలా ఫైర్ అవుతున్నారో చూడండి అంటూ మరో రాద్ధాంతం మొదలు పెట్టింది.

జగన్ చెప్పిందేంటి..?

మనం టీడీపీతో పాటు టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియాతో కూడా పోరాటం చేస్తున్నామంటూ జగన్ ఇప్పటికే చాలా సార్లు వైసీపీ నాయకుల్ని హెచ్చరించారు. దుష్ట చతుష్టయం అంటూ  చంద్రబాబుకి ఆ మూడు మీడియా సంస్థల్ని కలిపి మాట్లాడుతుంటారు జగన్. ఇంత చెబుతున్నా ఇంకా అంబటి లాంటివారు మాత్రం టీడీపీ మీడియాకు బుక్కైపోతున్నారు. అంత హడావిడిగా వచ్చీ రావడంతోనే ప్రెస్ మీట్లు పెట్టడం ఎందుకు, ట్రోలింగ్ కి గురవడం ఎందుకు..?

ఇప్పటి వరకూ అంబటి ఓ ఎమ్మెల్యేగా, వైసీపీ అధికార ప్రతినిధిగా విమర్శలు సంధించారంటే దాన్ని ఎవరూ తప్పుబట్టరు. ఆయనకు కూడా పెద్దగా సమస్యలు ఎదురుకాలేదు. కానీ మంత్రి అయిన తర్వాత ఆయన విమర్శలతోపాటు, తన సొంత శాఖ విషయాలపై సాధికారికంగా మాట్లాడాలనుకోవడంతోనే అసలు సమస్య మొదలైంది. 

ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డయాఫ్రం వాల్ గురించి ఎక్కడా మాట్లాడని అంబటి, ఇప్పుడు సడన్ గా దాని గురించి పెద్ద ఉపన్యాసం ఇవ్వాలనుకుని ఇరుక్కుపోయారు. ఒకేరోజు ప్రాజెక్ట్ లన్నిటిపై సమగ్రంగా మాట్లాడాలనుకుని పులిచింతల దగ్గర వైరి వర్గానికి దొరికిపోయారు.

మంత్రులంతా మేథావులని అనుకోలేం. ఆ మాటకొస్తే.. టీడీపీ హయాంలో అందరినీ డమ్మీలను చేసి ఆడించిన ఘనత చంద్రబాబుది కాదా. కానీ అమాత్య యోగం దక్కిన తర్వాత సహజంగా ఉండే కుతూహలం, ఆసక్తితో అంబటి లాంటి కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి మరీ చిక్కిపోతున్నారు. ఈ విషయంలో ఎల్లో మీడియా కూడా ఉందని కాస్త గుర్తుంచుకుంటే మంచిది. అసలు ప్రెస్ మీట్లు ఎందుకు, ఆ శాఖపై తన మార్క్ ఏదో చేతలతో చూపిస్తే సరిపోతుంది కదా? ఏమంటారు అంబటి రాంబాబు?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?