Advertisement

Advertisement


Home > Politics - Andhra

సలహాదారులవల్ల ఉపయోగం ఉందా?

సలహాదారులవల్ల ఉపయోగం ఉందా?

సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా (రాష్ట్రం కావొచ్చు, కేంద్ర కావొచ్చు) ముఖ్యమంత్రి, మంత్రులు (కేంద్రంలో ప్రధాని, మంత్రులు) పరిపాలన సాగించడానికి ఐఏఎస్ అధికారులు ఉంటారు. వీరినే సివిల్ సర్వీస్ అధికారులు అంటారు. మొత్తం పరిపాలనా వ్యవహారాలు చూసుకునేది వారే. సీఎం లేదా పీఎం ఆలోచనల నుంచి వచ్చే పథకాలకు రూపకల్పన చేసేది వారే. ప్రభుత్వానికి మంచిపేరు రావాలన్నా, చెడ్డ పేరు రావాలన్న ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారులే కారణం. వీరందరికీ బాధ్యత వహించే ఉన్నతాధికారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఒకవిధంగా చెప్పాలంటే పాలనా రథాన్ని ముందుకు తీసుకెళ్లే తెర వెనుక వ్యక్తులు వీరే. వీరు రోజువారీ పాలనా వ్యవహారాలు చూసుకోవడమే కాకుండా ముఖ్యమంత్రికి, మంత్రులకు అవసరమైన సలహాలు కూడా ఇస్తారు. 

కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా సలహాదారులను నియమించుకుంటున్నారు. తెలంగాణాకు చెందిన వారికి కూడా తన ప్రభుత్వంలో సలహాదారుల పదవులు ఇస్తున్నారు. వారికి బోలెడు జీతాలు ఇస్తున్నారు. సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. వారు జగన్ కు ఏం సలహాలు ఇస్తున్నారో నరమానవుడికీ తెలియదు. వారు ప్రభుత్వానికి ఏం ప్రయోజనం సమకూరుస్తున్నారో తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే మంత్రుల కంటే సలహాదారుల సంఖ్యే ఎక్కువ. గతంలో ఏ ప్రభుత్వంలోనూ లేని విధంగా సీఎం వైఎస్ జగన్ మంత్రులకంటే ఎక్కువగా సలహాదారులను నియమించుకున్నారు. ఇవన్నీ రాజ్యాంగబద్ధ పదవులు కాదు కదా. సృష్టించుకున్నవే కాబట్టి ఎంతమందినైనా పెట్టుకోవచ్చు.

గత ఏడాది నవంబరునాటికి 33 మంది సలహాదారులు ఉన్నారు. ఇప్పటికి ఆ సంఖ్య ఇంకా పెరిగి ఉంటుంది. కొన్నిరోజుల కిందటే సినీ నటుడు ఆలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించారు. తాజాగా సినీ, టీవీ గాయని సత్యవతి మంగ్లీ రాథోడ్‌ను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆమె పాడిన పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా గతంలో మంగ్లీ కలిసింది. ఎన్నికలు మరో ఏడాదిన్నరలో రానున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

మంగ్లీకి ఎస్వీబీసీ చానల్ సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మార్చిలోనే మంగ్లీని ఎస్వీబీసీ సలహాదారుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడగా.. ఇటీవలే ఆమె బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండేళ్ల పాటు మంగ్లీ ఈ పదవిలో కొనసాగుతుంది. ఆమెకు ప్రభుత్వం నెలకు లక్ష రూపాయిలు జీతంగా చెల్లిస్తుంది. కారు, ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి. 

సహాదారులకు ఒక్కొక్కరికి నెలకు రూ. 3 లక్షలు జీతంతో పాటు ప్రతి నెలా రెండు లక్షల అలవెన్సులు ఇవి కాకుండా ఆఫీస్, కారు, డ్రైవర్, పి.ఎస్ వంటి సదుపాయాలు అదనం. ఓ ఐదారుగురు సలహాదారులకు క్యాబినెట్ ర్యాంక్ తో పాటు ప్రోటోకాల్ అదనం.

ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సలహాదారులకు ఇంతలేసి జీతాలు, ఇన్ని వసతులు, ఇంత హంగామా అవసరమా అని ఒకా నొక సందర్భంలో ఎపీ హైకోర్టు ప్రభుత్వానికి అంక్షింతలు వేసింది. కొన్ని కారణాల వల్ల రాజకీయంగా అవకాశం దక్కనివారు, పార్టీకి సేవ చేసినా పదవులు రానివారు, రాజకీయంగా, సంస్థాగతం, వ్యక్తిగతంగా సీఎం జగన్ కు సహకరించిన వారు, ఆబ్లిగేషన్స్ ఉన్నవారిని ప్రభుత్వంలో సలహాదారులగా నియమించారు. సలహాదారులకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు న్యాయమూర్తులు, సి.ఎస్, డి.జి.పి వంటి వారికి కూడా కల్పించడం లేదని, ప్రభుత్వ శైలి ప్రజాధనం లూటీ చేసేమాదిరిగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇన్ని ఆరోపణలు, విమర్శలు వస్తున్నా ప్రభుత్వం మాత్రం సలహాదారులపై మాటపడనీయడం లేదు. 

ఇంత చేసినా వీరి వల్ల ప్రభుత్వానికి ఉపయోగం లేకపోగా, నష్టమే ఎక్కువ జరుగుతుందనే అభిప్రాయం ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలోనూ వ్యక్తమవుతోంది. కొన్ని కీలక అంశాల్లో తమను సంప్రదించకపోవడం, తమకు తెలియకుండానే నిర్ణయాలు తీసుకోవడంతో కొందరు సలహాదారులు రాజీనామా చేసి వెళ్లిపోయారు. నెలనెలా కోట్లలో ఖర్ఛు పెట్టి సలహాదారులను నియమించుకుంటే వారిచ్చే సలహాలు పార్టీకి, ప్రభుత్వానికి ఉపయోగపడకపోగా చెడ్డపేరు తెచ్చేలా ఉంటున్నాయని, పైగా సలహాదారులలో కేబినెట్ ర్యాంక్ ఉన్న కొందరి పాత్ర నామనాత్రంగానే ఉంది తప్ప ప్రభుత్వానికి, పార్టీకి ఉపయోగపడటంలేదనే భావన వ్యక్తమవుతోంది.

ప్రభుత్వ నిర్ణయాలను అటు సమర్ధించలేక ఇటు గట్టిగా ప్రభుత్వం తరఫున వాయిస్ వినిపించ లేక సతమతమయ్యే కొందరి వల్ల ప్రయోజనం శూన్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెల తిరిగేసరికి ఠంచనుగా జీతభత్యాలు అందుకుంటారు తప్ప వారు సలహాలు ఇచ్చేది లేదు ప్రభుత్వం తీసుకునేది లేదు. 

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా