cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Andhra

స‌మ‌యం లేదు మిత్రుల్లారా...స‌మ‌ర‌మా?ప‌లాయ‌న‌మా?

స‌మ‌యం లేదు మిత్రుల్లారా...స‌మ‌ర‌మా?ప‌లాయ‌న‌మా?

ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు ఏ క్ష‌ణ‌మైనా రావ‌చ్చ‌ని, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాల‌ని టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప‌దేప‌దే చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో బాబు క‌ల‌వ‌రిస్తున్న‌ట్టుగానే ఆత్మ‌కూరు రూపంలో ముంద‌స్తు ఎన్నిక వ‌చ్చింది. మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి ఆక‌స్మిక మృతితో నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది.

దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో 3 ఎంపీ, 7 ఎమ్మెల్యే స్థానాల‌కు వివిధ కార‌ణాల‌తో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. వీటిలో ఆత్మ‌కూరు ఉంది. ఈ నెల 30న ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల అవుతుంది. జూన్ 23న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. నామినేష‌న్‌కు పెద్ద స‌మ‌యం కూడా లేదు. ఉప ఎన్నిక‌లో బాధిత ప్ర‌జాప్ర‌తినిధి కుటుంబ స‌భ్యులెవ‌రైనా అభ్య‌ర్థిగా నిలిస్తే, పోటీ పెట్ట‌కూడ‌ద‌నే నిబంధ‌న‌లు ఏనాడో గాల్లో క‌లిసిపోయాయి. కాబ‌ట్టి ఆత్మ‌కూరులో పోటీ అనివార్యం.

ఎటూ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ, దాని అన‌ధికార మిత్ర‌ప‌క్షం జ‌న‌సేన‌, బీజేపీ ఇలా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ ప్ర‌భుత్వం పేరుతో అధికార పార్టీ నేత‌లు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళుతుంటే ఎక్క‌డిక‌క్క‌డ నిల‌దీస్తున్నారని ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 

ఇవ‌న్నీ ప్ర‌తిప‌క్షాల‌కు సానుకూల అంశాలే. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై జ‌నంలో ఏ స్థాయిలో వ్య‌తిరేక‌త ఉందో చాటి చెప్ప‌డానికి ఆత్మ‌కూరు ఉప ఎన్నిక ప్ర‌తిప‌క్షాల‌కు ఆయాచిత వ‌ర‌మ‌నే చెప్పాలి.

కావున అధికార పార్టీ పోటీ పెట్ట‌కూడ‌ద‌ని వేడుకున్నా, వినిపించుకోకుండా త‌ప్ప‌క బ‌రిలో నిల‌వాలి. తెలంగాణాలో దుబ్బాక‌, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష పార్టీ బీజేపీ విజ‌యం సాధించిన‌ట్టు...ఆత్మ‌కూరులో అధికార పార్టీకి బుద్ధి చెప్పేలా వ్యూహాలు ర‌చించాలి. 

టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసా లేక వేర్వేరుగా పోటీ చేస్తాయా? అనేది ఆత్మ‌కూరు ఉప ఎన్నిక తేల్చ‌నుంది. ఉప ఎన్నిక బ‌రి నుంచి త‌ప్పుకోడానికి చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ సాకులు చెప్ప‌ర‌ని ఆశిద్దాం. ఎందుకంటే జ‌గ‌న్‌ను వెంట‌నే గ‌ద్దె దింపాల‌ని ఆశ ప‌డుతున్న‌ది వీళ్లిద్ద‌రే. 

పోటీకి స‌మ‌యం లేదు. మిత్రులైన చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌మ‌రానికి సై అంటారా? లేక ప‌లాయ‌నం చిత్త‌గిస్తారా? అనేది తేల‌డానికి ఎక్కువ రోజులు ప‌ట్ట‌వు.

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి