Advertisement

Advertisement


Home > Politics - Andhra

చేసిందంతా చేసి... బాలినేని స‌ర్క‌స్ ఫీట్లు!

చేసిందంతా చేసి... బాలినేని స‌ర్క‌స్ ఫీట్లు!

మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి చేసిన కామెంట్స్ రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. త‌ర‌చూ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడ్డం బాలినేనికి అల‌వాటైంది. ఇదేదో అమాయ‌క‌త్వంతో ఆయ‌న చేస్తున్నార‌ని అనుకుంటే, అది అనుకునే వాళ్ల అజ్ఞాన‌మే అవుతుంది.

బాలినేని వైఖ‌రితో వైసీపీ శ్రేణులు మాత్రం విసిగిపోయాయి. మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పించిన‌ప్పుడు అల‌క‌బూని, బాధ‌లో ఏదో అన్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు. మంత్రిగా డ‌బ్బు తీసుకున్నాన‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా, మ‌ళ్లీ ఇవాళ క‌ప్పి పుచ్చుకోవ‌డానికి ఆయ‌న మీడియా ముందుకొచ్చారు.

మినిస్ట‌ర్‌గా డ‌బ్బు తీసుకున్నాన‌న్న కామెంట్స్‌పై వివ‌ర‌ణ ఇస్తూ, అదంతా పార్టీ ఫండ్ అని స‌మ‌ర్థించుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇందిరా గాంధీ హ‌యాంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చిన‌ప్పుడు త‌మ భూమిని పేద‌ల‌కు ఎన్ని ఎక‌రాలు ఇచ్చామో వూరికి వెళ్లి అడిగితే తెలుస్తుంద‌న్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యే, రెండు ద‌ఫాలు మంత్రి అయిన తాను తాత‌గారి నుంచి సంక్ర‌మించిన ఆస్తిలో స‌గం క‌రిగించాన‌న్నారు.

కాలేజీ రోజుల నుంచి ఎవ‌రైనా డ‌బ్బు అడిగితే ఇంట్లో గొడ‌వ చేసైనా స‌రే తీసుకెళ్లి ఇచ్చే మ‌న‌స్త‌త్వం త‌న‌ద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. త‌న ద‌గ్గ‌ర ప‌ది రూపాయ‌లు వుంటే, మ‌రో ఇర‌వై అప్పు చేసి ప్ర‌జ‌ల‌కు పంచి పెడుతున్నట్టు ఆయ‌న చెప్పారు. అది ఓర్చుకోలేక వంద‌ల కోట్లు సంపాదించాన‌ని ఆరోపిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ఒంగోలులో త‌న‌కు రూ.15 కోట్లు అప్పు వున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. అది కూడా తెలుగుదేశం సంబంధీకుల వ‌ద్ద అప్పు తీసుకున్న‌ట్టు ఆయ‌న చెప్పారు.

గ‌త ఎన్నిక‌ల్లో ఖ‌ర్చంతా వియ్యంకుడు పెట్టాడ‌న్నారు. ఇప్పుడు కూడా అత‌నే పెడ‌తార‌న్నారు. ఈ ప‌రిస్థితుల్లో తాను వుంటే అంత సంపాదించాడు, ఇంత సంపాదించాడ‌ని మాట్లాడుతున్నార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అందుకే నిన్న ఆ విధంగా బాధ‌తో మాట్లాడిన‌ట్టు చెప్పారు.

నోటి కొచ్చిన‌ట్టు మాట్లాడి మ‌ళ్లీ ఇప్పుడు న‌ష్ట నివార‌ణ‌కు ఏవేవో చెప్ప‌డం దేనికి? అస‌లు బాలినేని వ‌ల్ల వైసీపీకి లాభం ఏంటి? ఇత‌ని వైఖ‌రితో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ స‌మాధానం చెప్పుకోలేని ప‌రిస్థితి త‌లెత్తింద‌ని ఆ పార్టీ నేత‌లు వాపోతున్నారు. సీఎం జ‌గ‌న్‌కు బంధువు కావ‌డం వ‌ల్లే ఆయ‌న త‌ప్పులు చేసినా అధిష్టానం చూసీచూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే చర్చ న‌డుస్తోంది. బాలినేని చేసిందంతా చేసి, ఇప్పుడు త‌న తాత‌లు, ముత్తాత‌ల కాలం నుంచి చ‌రిత్ర‌లు చెబుతున్నార‌ని వైసీపీ నేత‌లు మండిప‌డుతున్నారు.

ఇప్ప‌టికైనా బాలినేనికి వైసీపీ అవ‌స‌ర‌మా? లేక పార్టీకి బాలినేని అవ‌స‌రమా? అనేది ఆలోచించి కీల‌క నిర్ణ‌యం తీసుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్న‌ది అంద‌రి మాట‌. ఎన్నిక‌ల స‌మ‌యంలో బాలినేని వ‌ల్ల రానున్న రోజుల్లో మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?