Advertisement

Advertisement


Home > Politics - Andhra

నా భూమిలో జగన్ బొమ్మ...భయమేస్తోందా...?

నా భూమిలో జగన్ బొమ్మ...భయమేస్తోందా...?

ఏంటో తెలుగుదేశం పార్టీ వారికి జగన్ ఏమి చేసినా చెడ్డగానీ పాడుగానే ఉంటోంది. అక్కడికి తమ ప్రభుత్వంలో తాము ఏమీ చేయనట్లుగా భావిస్తూ మాటలు చాలానే చెబుతున్నారు. తన భూమికి సంబంధించి పట్టాదారు పాసు బుక్కు మీద జగన్ బొమ్మ ఏంటి అని మండుతున్నారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. నా భూమిలో సర్వే రాయి మీద జగన్ బొమ్మ ఏంటి ఆయన మాకేమైనా భూమి ఇచ్చాడా అంటూ బండారు వారు యమ సీరియస్ అయిపోతున్నారు.

గత టీడీపీ సర్కార్ లో కూడా చంద్రబాబు ప్రతీ దానికీ తన బొమ్మ అచ్చేసుకున్నఅలనాటి మంచి విషయాలను ఆయన కన్వీనియెంట్ గా మరచిపోతున్నారు. కాదేదీ బొమ్మకు అనర్హం అన్నట్లుగా నాడూ చాలానే  చేశారు. ఇపుడు మాత్రం నా భూమి జగన్ బొమ్మ అంటూ పెద్దాయన ఆవేశపడుతున్నారు అని అంటున్నారు.

ఈ విషయంలో జగన్ ఏమి చేశారు నాకు ఏమైనా భూమి ఇచ్చారా అని లాజిక్ పాయింట్ తీస్తున్నారు. ఆయన భూమి ఇవ్వలేదు, ఇచ్చిన భూములకు రక్షణ కల్పిస్తున్నారు. వందేళ్ళ క్రితం ఎపుడో బ్రిటిష్ వారి టైం లో చేసిన సర్వేలు తప్ప దిక్కూ దివాణం లేని రికార్డులకు ప్రాణం పోసి రీ సర్వే చేసి ఇది మీ భూమి అని పేదలకే తిరిగి అప్పగిస్తున్నారు. మరి దాన్ని భూమి ఇవ్వడం అంటారో కాదో బండారు వారే చెప్పాలి.

పెత్తందార్లు కామందులు భూములు అప్పనంగా సర్వేలు కూడా లేకుండా మాయం చేస్తూ రికార్డులు తారు మారు చేస్తూ దోచుకుంటున్న నేపధ్యం లో భూ రక్ష పధకం చేపట్టడం ఒక విప్లవాత్మమైన చర్య. ఈ విషయంలో గత ప్రభుత్వాలు ఏవీ ఏనాడూ ఆలోచన చేయలేదు. జగన్ దాని మీద దృష్టి పెట్టి కోట్ల రూపాయలు పెట్టి మరీ రీ సర్వే చేయిస్తున్నారు. దీని వల్ల అసలైన పేదకు జగన్ బొమ్మ ఎందుకు తమ పట్టాదారు పాస్ బుక్కు మీద ఉందో అలా ఉండడం ఎంతవరకూ అర్హమో అర్ధమవుతుంది.

వారికోసమే ఈ సర్వే ఈ పాసుబుక్కులు. మరి తమకు జగన్ బొమ్మ తో పాస్ బుక్కు ఏంటి అంటే మాజీ మంత్రి వారు అంటే ఆయనకో రూలూ పేదలకో విధానం ఉండదు కదా. ఆయన విపక్ష నేత అయినా వేరే పార్టీ అయినా ప్రభుత్వం తమ ముద్ర ఉండాలనుకుని చేస్తున్న మంచి కార్యక్రమం కాబట్టి బొమ్మతో బుక్కు తప్పదేమో.

కోర్టుకు దీని మీద వెళ్తాను అని మాజీ మంత్రి గారు అంటున్నారు. మరి అక్కడ ఏమి చెబుతారో చూడాలి. ఈ లోగా అవినీతి పరుడు ఆక్రమదారుడు అంటూ ఆయన బొమ్మా అని ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి మీద నోరు పారేసుకోవడం కంటే తాను చేయాలనుకున్నదేదో చేస్తే మంచిది కదా అని అంటున్నారు అంతా.

అయినా జగన్ బొమ్మ ఎందుకు అక్కడ రాయి ఎందుకు అని ప్రశ్నించే  బదులు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త కార్యక్రమంలో తప్పులు ఉంటే చెప్పాలి. ఒప్పులు ఉంటే మెచ్చాలి. ఇది కదా అసలైన ప్రతిపక్షం తీరు. అలాంటి ఆశలు ఏవీ ఏపీ ప్రజలకు లేవు అని పదే పదే ఇలా రుజువు చేస్తున్నారు తమ్ముళ్ళు అంటున్నారు అంతా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?