Advertisement

Advertisement


Home > Politics - Andhra

అయిపాయ్‌...అంతేగా!

అయిపాయ్‌...అంతేగా!

జ‌న‌సేనతో సంబంధం లేకుండానే నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు ఉప ఎన్నిక బ‌రిలో నిల‌వాల‌ని బీజేపీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ విష‌యాన్ని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు తేల్చి చెప్పారు. ఇక జ‌న‌సేన‌తో పొత్తు ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. బీజేపీ ఒంటెత్తు పోక‌డ‌పై జ‌న‌సేన గుర్రుగా ఉన్న‌ట్టు స‌మాచారం.

మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి ఆక‌స్మిక మృతితో ఆత్మ‌కూరుకు ఉప ఎన్నిక అనివార్య‌మైంది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆత్మ‌కూరు ఉప ఎన్నిక తేదీని ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో ఇవాళ నెల్లూరులో బీజేపీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశం నిర్వ‌హించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. స‌మావేశం నిమిత్తం నెల్లూరుకు వ‌చ్చిన జీవీఎల్ మీడియాతో మాట్లాడారు.  

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జనసేనతో కలిసి పోటీ చేస్తామన్నారు. ఎవరితోనూ పొత్తులు ఉండవని జీవీఎల్ స్ప‌ష్టం చేశారు (టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసి పోటీ చేస్తాయ‌నే ప్ర‌చారానికి మ‌రోసారి ఆయ‌న తెర‌దించారు). నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుందని జీవీఎల్ ప్రకటించడం ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. ఇదే విష‌యాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు కూడా చెప్పారు.

మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన‌తో సంప్ర‌దించ‌కుండానే ఆత్మ‌కూరు బ‌రిలో నిల‌వాల‌ని బీజేపీ నిర్ణ‌యించ‌డం చ‌ర్చ‌కు తెర‌లేచింది. గ‌తంలో క‌డ‌ప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక అనుభ‌వాన్నిదృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు బీజేపీ నేత‌లు చెబుతున్నారు. గౌత‌మ్‌రెడ్డి కుటుంబ స‌భ్యులు బ‌రిలో నిలిస్తే జ‌న‌సేన పోటీలో నిలిచేందుకు ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌ద‌నే ఉద్దేశంతో తామీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు బీజేపీ నేత‌లు చెప్ప‌డం విశేషం.

అయితే క‌నీస మ‌ర్యాద‌ను కూడా బీజేపీ పాటించ‌లేద‌ని జ‌న‌సేన నేత‌లు మండిప‌డుతున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఇచ్చే గౌర‌వం ఇదేనా అని వారు నిల‌దీస్తున్నారు. ఇలాగైతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ విధంగా క‌లిసి పోటీ చేయ‌గ‌ల‌మ‌ని జ‌న‌సేన నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. బీజేపీ త‌న నిర్ణ‌యాన్ని తీసుకుంది. ఇక జ‌న‌సేన ఏం చేస్తుందో చూడాలి. మేక‌పాటి సంబంధీకుల నుంచే బీజేపీ త‌ర‌పున అభ్య‌ర్థి బ‌రిలో నిల‌వ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?