Advertisement

Advertisement


Home > Politics - Andhra

కేసీఆర్ పోటీదారేనని తేల్చేసిన బీజేపీ నేత

కేసీఆర్ పోటీదారేనని తేల్చేసిన బీజేపీ నేత

తెలంగాణా సీఎం కేసీఆర్ కు జాతీయ రాజకీయాల పిచ్చి పట్టుకొని చాలా ఏళ్లయింది. అయితే ఈ పిచ్చి తప్పు కాదు. ఏ రాజకీయ నాయకుడైనా ఎదగాలనుకుంటాడుగానీ ఉన్నచోటనే ఉండాలని అనుకోడు కదా. కేసీఆర్ కూడా అలాగే అనుకుంటున్నారు. రాష్ట్రంలో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలు ఆయన్ని బీజేపీ వ్యతిరేకిగా మార్చాయి. 

కాంగ్రెసుపై వ్యతిరేకతతోపాటు, బీజేపీ మీద కూడా వ్యతిరేకత పెరగడంతో ఈ రెండు పార్టీల కూటములకు పోటీగా నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకున్నారు. అందుకోసం చాలా ప్రయత్నాలు చేశారు. రాష్ట్రాలు తిరిగారు. ఆ రెండు పార్టీలను వ్యతిరేకించే నాయకులను కలిశారు. మంతనాలు జరిపారు. కానీ కొన్ని కారణాల వల్ల కేసీఆర్ ప్రయత్నాలు ఫలించలేదు.

కేసీఆర్ ఎప్పుడైతే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ప్రయత్నాలు మొదలుపెట్టారో అప్పుడే రాష్ట్రానికి కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తారనే పుకార్లు షికారు చేశాయి. కొందరు టీఆర్‌ఎస్‌ నాయకులు కేటీఆర్ సీఎం కావడం గ్యారంటీ అని జోస్యం కూడా చెప్పారు. ఒక నాయకుడైతే డేట్ కూడా ప్రకటించాడు. మంత్రులు కూడా ఇలాంటి ప్రకటనలే చేశారు. 

కేటీఆర్ సీఎం అవుతారనే నమ్మకంతోపాటు కేసీఆర్ ప్రధాని అవుతారని గట్టిగా నమ్మారు. కొందరు నాయకులు అత్యుత్సహంతో దేశ్ కీ నేత కేసీఆర్ అని, దేశ్ కీ ప్రధాని కేసీఆర్ అని నినదించారు కూడా. కొన్ని ఊళ్ళల్లో కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు.

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న కేసీఆర్ ప్రయత్నాలు ఫలించకపోవడంతో చప్పబడిపోయారు. కానీ ఒకటిమాత్రం వాస్తవం. దేశానికి ప్రధాని కావాలనే కోరిక కేసీఆర్ కు బలంగా ఉంది. జాతీయ రాజకీయాల్లో క్లిక్ అయితే తాను ప్రధాని కావడానికి మార్గం సుగమం అవుతుందని ఆయన ఉద్దేశం. కొంతకాలం కిందట జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడానికి కేసీఆర్ ప్లాన్ చేశారు. దానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్ ఎస్) అనే పేరు పెట్టాలని అనుకున్నట్లు ప్రచారం జరిగింది. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కూడా పిలిపించి మంతనాలు జరిపారు.

ఇదిలా ఉంటే... కేసీఆర్ కు ఉన్న ప్రజాదరణ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉన్న మెజారిటీని ఇతర రాష్ర్టాల బీజేపీ నేతలు ఒప్పుకోక తప్పడం లేదు. విపక్షాల తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా నితీశ్‌ కుమార్ పేరు తరచుగా వినబడుతుండటంపై బీహార్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ నేత సుశీల్‌ కుమార్‌ మోదీ స్పందించారు. విపక్షాల తరపు ప్రధాని అభ్యర్థి రేసులో కేసీఆర్‌ వంటి ప్రజాదరణ కలిగిన నేతలూ ఉన్నారని చెప్పారు. 

కేసీఆర్‌ ఓ బలమైన నేత అని, ఆయనకు అచంచలమైన ప్రజాదరణ ఉన్నదని పొగడ్తలతో ముంచెత్తారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ కూడా బలమైన నేతలేనని తెలిపారు. అంటే కేసీఆర్ కూడా ప్రధాని పదవికి పోటీదారేనని బీజేపీ అంగీకరించిందని అనుకోవాలా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?