Advertisement

Advertisement


Home > Politics - Andhra

టికెట్ ఇవ్వ‌క‌పోయారా... టీడీపీ నేత వార్నింగ్‌!

టికెట్ ఇవ్వ‌క‌పోయారా... టీడీపీ నేత వార్నింగ్‌!

ఇది ఎన్నిక‌ల కాలం. ఎలాగైనా టికెట్ ద‌క్కించుకుని చ‌ట్ట‌స‌భ‌లో అడుగు పెట్టాల‌ని అన్ని రాజ‌కీయ పార్టీల నాయ‌కులు ఆశిస్తున్నారు. రాజ‌కీయ పార్టీల అధినేత‌ల విష‌యానికి వ‌స్తే... స‌ర్వేలు చేయించుకుని, గెలిచే వారికే టికెట్లు ఇస్తామ‌ని తేల్చి చెబుతున్నారు. ఎన్నిక‌ల్లో  వ్య‌క్తుల కంటే విజ‌యాలే ముఖ్య‌మ‌ని అధినేత‌లు కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు చెబుతున్నారు.

మ‌రోవైపు టికెట్ల కోసం కొంద‌రు నేత‌లు బ్లాక్ మెయిల్‌కు వెనుకాడ‌డం లేదు. త‌మ అధినేత‌ల కోసం ఏమైనా మాట్లాడ్తాం, అవ‌స‌ర‌మైతే జైలుకు వెళ్ల‌డానికైనా సిద్ధ‌మే అంటూ వీర విధేయులు పుట్టుకొస్తున్నారు. అలాంటి వారిలో చంద్ర‌బాబు, లోకేశ్‌ల వీర విధేయుడిగా మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న చెప్పుకుంటుంటారు. ఈ ప‌రంప‌రలో చంద్ర‌బాబుపై నోరు పారేసుకునే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీల‌కు ఈయ‌న గారు ప‌రుష ప‌ద‌జాలంతో కౌంట‌ర్లు ఇస్తుంటారు.

త‌మ నాయ‌కుడిపై ఈగ వాలితే ఓర్చుకోన‌ని, బాబును వంద మాట‌లంటే, తాను కూడా అదే భాష‌లో స‌మాధానం ఇస్తాన‌ని ఆయ‌న వార్నింగ్‌లు ఇస్తుంటారు. మ‌రోసారి చంద్ర‌బాబు, లోకేశ్‌ల మ‌న‌సు దోచుకుని టికెట్ ద‌క్కించుకునేందుకు బుద్ధా వెంక‌న్న ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు.

బుద్ధా వెంక‌న్న ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఇటు చంద్ర‌బాబు, అటు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ల‌కు టికెట్ విష‌య‌మై స్వీట్ వార్నింగ్ ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌హైంది. విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌ను ఆశిస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. బీసీ అభ్య‌ర్థిగా త‌న‌కు సీటు ఇస్తార‌న్న న‌మ్మ‌కం ఉంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఒక‌వేళ త‌న‌కు సీటు ఇవ్వ‌క‌పోతే ఆప్ష‌న్ బీ కూడా వుంద‌ని ఆయ‌న హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.  

విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్ర‌స్తుతం వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన కూడా బ‌రిలో వుండ‌డంతో ఓట్లు చీలి వెల్లంప‌ల్లి గెలుపొందార‌ని ఆ పార్టీల నేత‌ల మాట‌. ఈ ద‌ఫా వెల్లంప‌ల్లికి అంత సులువు కాద‌నే మాట వినిపిస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన త‌ర‌పున పోతిన మ‌హేశ్ పోటీ చేయాల‌ని అనుకుంటున్నారు.

అయితే జ‌న‌సేన‌కు సీటు కేటాయిస్తే టీడీపీ ప‌ని చేయ‌ద‌ని ప‌రోక్షంగా బుద్ధా వార్నింగ్ ఇచ్చార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఇత‌రుల కోసం త‌మ నాయ‌క‌త్వాన్ని బ‌లి పెట్ట‌డానికి ఎవ‌రూ సిద్ధంగా వుండ‌రు. ఇందుకు విజ‌య‌వాడ పశ్చిమ నియోజ‌క‌వ‌ర్గం అతీతం కాదు. తాను ఆశించే సీటును జ‌న‌సేన‌కు ఇస్తార‌నే అనుమానం టీడీపీ నేత‌ల్లో వుంది. అయితే పోతిన మ‌హేశ్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం టీడీపీ నేత‌లెవ‌రికీ ఇష్టం లేదు. అందుకే ఆప్ష‌న్ల‌ను టీడీపీ నేత‌లు తెర‌పైకి తెస్తున్నారు. చూడాలి ఏమ‌వుతుందో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?