Advertisement

Advertisement


Home > Politics - Andhra

మళ్లీ అన్న క్యాంటీన్లు.. ఏం చేస్తారో చూడాలి

మళ్లీ అన్న క్యాంటీన్లు.. ఏం చేస్తారో చూడాలి

ఎన్ఆర్ఐల సహకారంతో అక్కడక్కడా టీడీపీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్లు మొదలుపెడుతున్నారు. తాజాగా బాలకృష్ణ కూడా ఓ క్యాంటీన్ ప్రారంభించారు. వైసీపీపై టీడీపీ చేస్తున్న విమర్శల్లో ప్రధానమైనది అన్న క్యాంటీన్ల ఎత్తివేత. 

బోలెడన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా, ఇక 5 రూపాయలకు భోజనం పథకం ఎందుకని దాన్ని ఎత్తేశారు జగన్. కానీ దాన్నే పట్టుకుని వేలాడుతున్నారు టీడీపీ నాయకులు. పేదవాటి నోటి కాడ ముద్ద లాగేశారంటూ విమర్శిస్తున్నారు. అందుకే వారే క్యాంటీన్లు పెట్టే స్థాయికి వచ్చేశారు. అయితే వీటిని నడపడం చాలా కష్టం. ఏడాదిపాటు ప్రయోగాత్మకంగా నడుపుతామంటున్నారు బాలయ్య. చివరికి వీటి ద్వారా ఏం సాధిస్తారో చూడాలి.

అన్న క్యాంటీన్లు తీసేసిన తర్వాత పేదల నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదు కానీ, టీడీపీ మాత్రం రాద్ధాంతం చేయడం మొదలు పెట్టింది. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లను కొనసాగిస్తున్నారు కదా, అక్కడ స్టాలిన్ కి లేని నొప్పి ఇక్కడ జగన్ కి ఎందుకని నిలదీస్తోంది. 

పైగా అన్న అనే పేరు కూడా పోయింది. దీంతో టీడీపీ కనీసం తమ హయాంలో మొదలైన పథకం ఇది అని చెప్పుకోడానికి కూడా లేకుండా పోయింది. పైగా భవనాలు కూడా ఖాళీగా లేకుండా ఎక్కడికక్కడ సచివాలయాలుగా మారిపోయాయి. ఆనవాళ్లు కూడా మిగలకపోవడంతో చంద్రబాబు మొదట్లోనే షాకయ్యారు. సరిగ్గా ఎన్నికలకు రెండేళ్ల ముందు అన్న క్యాంటీన్లు అంటూ డ్రామా మొదలు పెట్టారు.

5 రూపాయలకే అన్నం అనే కాన్సెప్ట్ బాగానే ఉన్నా... టీడీపీ కూడా ఎన్నికలకు ఏడాది ముందుగానే వాటిని ప్రవేశపెట్టింది. అంటే పూర్తి స్థాయిలో వీటి నిర్వహణపై దృష్టి పెట్టేలోపే ఎన్నికలొచ్చేశాయి. అన్న క్యాంటీన్ల వల్ల యాచకులు, కొన్ని చోట్ల రోజువారీ కూలీలు కడుపునిండా తిన్నారనేది మాత్రం వాస్తవం. 

ఇప్పుడు క్యాంటీన్లు లేకపోయినా పెద్దగా సమస్య లేదు. ఉన్నా వాటి వల్ల ప్రత్యేకంగా ఒరిగేదేమీ ఉండదు. కానీ టీడీపీ వీటిపై పంతానికి పోతోంది. ప్రభుత్వమే చేతులెచ్చేసింది, తాము సొంత డబ్బుతో పథకాన్ని అమలు చేస్తున్నాం చూడండి అంటూ ఫోజు కొట్టడానికి ప్రయత్నిస్తోంది.

అయితే నిర్వహణ భారంతో వీటిని నెలల వ్యవధిలోనే మూసివేయక తప్పదు. పైగా నిర్వహణ ప్రభుత్వానిది కాదు కాబట్టి.. అన్న క్యాంటీన్ కి వచ్చేవారి ప్రశ్నలను తట్టుకోవడం కష్టం. ఏమాత్రం ఆహార నాణ్యతలో లోపాలు వచ్చినా అది టీడీపీకి పెద్ద దెబ్బగా మారుతుంది. 

ఇక శాంతి భద్రతల సమస్య తలెత్తితే వెంటనే వాటిని మూసేయడానికి ప్రభుత్వం వెనకాడదు. సో.. ఎలాగైనా ఏదో ఒక కలకలం రేపడానికే అన్న క్యాంటీన్లు అనే కాన్సెప్ట్ పట్టుకున్నారు చంద్రబాబు. ఎన్నారై నిధులంటూ వీటిని మళ్లీ తెరపైకి తెచ్చారు. అయితే ఎన్నికల నాటికి వీటి వల్ల లాభం ఉంటుందా, మధ్యలోనే బాబు చేతులెత్తేస్తారా అనేది తేలాల్సి ఉంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?